ఏపీలో నకిలీ మద్యం ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అవకాశం దొరికింది కదా అని వైసీపీ వెనుకాముందు చూడకుండా కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు రెడీ అయిపోయింది. లిక్కర్ స్కామ్ ఆరోపణలు తుడిచేసుకునేందుకు ఈ అంశాన్ని వాడుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ సైతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సా*క్షిలో టీడీపీ టార్గెట్‌గా కథనాలు వండి వారిస్తున్నారు.
ఐతే ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారీ, బాట్లింగ్ కేంద్రం గడిచిన రెండున్నరేళ్లుగా కొనసాగుతుందని నిర్ధారించారు. అంటే ఈ పాపం వైసీపీదే అని తేలిపోయింది. ఇబ్రహీంపట్నం పాతబార్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు అక్కడి పరిస్థితులను బట్టి అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఖాళీ క్యాన్లు దొరికాయి. మద్యంతో ఉన్నవి 5 క్యాన్లు దొరికాయి. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి, బెల్టు దుకాణాలకు తరలిస్తున్న విషయం స్థానిక వైసీపీ నేతలకు కూడా తెలుసని సమాచారం.
ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ దందాకు బెంగళూరు నుంచే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు అధికారులు. బెంగళూరుకు చెందిన బాలాజీ నుంచి అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు సరకు వచ్చేది. అక్కడ మాల్ట్, కారమెల్ కలిపాక క్యాన్లలో రహస్యంగా ఇబ్రహీంపట్నం తరలించేవారు. ఇక్కడి గోదాముల్లో చిన్న క్యాన్లలో నింపి అమ్మకాలకు పంపిస్తుండేవారు. అసలు హోలోగ్రామ్ స్టిక్కర్లను పోలినట్లుగా ఉండేలా బాలాజీ నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లను ముద్రించి పంపించేవాడు. ఈ సీసాలను గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో తయారు చేయించారు. వీటికి వేసే లేబుళ్ల అచ్చు అసలుకు తీసిపోని రీతిలో తయారు చేయించారు. హైదరాబాద్‌కు చెందిన రవి వీటిని సరఫరా చేసినట్లు తేలింది. నకిలీ మద్యం తయారీలో పెద్దగా వాసన రాని ఎక్స్‌ట్రా న్యూట్రల్ స్పిరిట్‌ను వాడినట్లు గుర్తించారు. రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే ఎక్కువ వాసన వచ్చి నకిలీది అని తెలుస్తుందని ఎక్స్‌ట్రా న్యూట్రల్ స్పిరిట్‌ను ఉపయోగించినట్లు తేల్చారు.
నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల పాత్ర ఉందన్న విషయం తెలియగానే అధిష్టానం చర్యలకు దిగింది. వైసీపీకి అవకాశం ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశాలు జారీ చేసింది.
జయచంద్రారెడ్డి వ్యవహారం మొదట నుంచీ వివాదాస్పదంగానే ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా..దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2023 వరకు వైసీపీలో కొనసాగిన జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ గూటికి చేరారు. దీంతో 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చింది తెలుగుదేశం. ఆ ఎన్నికల్లో ఆయన 10వేలకు పైగా ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏమాత్రం కృషి చేయలేదని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోవడంతో అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది.











