కనకదుర్గ ఫ్లైఓవర్ కు చిన్న పమాదం వాటిల్లింది. బ్రిడ్జి కూలిపోవడం లాంటి పెద్ద ప్రమాదం కాదు గానీ.. అశోక్ పిల్లర్ సమీపంలో ఫ్లై ఓవర్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఫ్లై ఓవర్ కాంక్రిట్ పెచ్చులు ఊడి పడటంతో కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి.
APSP బెటాలియన్ కి చెందిన రాంబాబు దసరా ఉత్సవాల బందోబస్తు లో భాగంగా విధి నిర్వహణలో ఉన్నారు. రాంబాబు మీద పెచ్చులు పడటంతో అతని చేతికి, భుజానికి గాయాలు అయ్యాయి. వంతెనను ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లై ఓవర్ పటిష్ట పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు.
హైదరాబాదు మెట్రో ప్రమాదం లాగా..
హైదరాబాదు మెట్రో వ్యవస్థను కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అయితే.. గతంలో ఇదే తరహాలో వర్షాలు భారీగా పడుతున్నప్పుడు.. మెట్రో స్టేషన్ కింద వర్షానికి ఆగి ఉన్న వారిపై సిమెంటు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ కింద కూడా అదే తరహాలో సిమెంటు పెచ్చులు ఊడిపడ్డాయి. మరణాలు సంభవించలేదు గానీ.. గాయాలు తప్పలేదు. మరీ ఘోరంగా ప్రారంభించిన రెండు రోజుల్లోగానే ఇలా జరగడం విమర్శలకు తావిస్తోంది.











