ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలను కొవిడ్ ఇంకా వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్ తయారీపై ఇంకా కొన్ని కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలకు సంబంధించిన టీకాలూ ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉందని చెబుతూ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ కొన్నాళ్ల క్రితం అధికార వైసీపీ అభ్యంతరం చెప్పింది. ఇప్పటికే కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ కర్ఫ్యూలు, పాక్షిక లాక్ డౌన్‌లు అమలవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియకూ ప్రపంచంలోని పలు దేశాలు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ తరుణంలో లోక్‌సభలో వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాతీయ మీడియాలోనూ ఇది చర్చనీయాంశంగా మారింది.
సమయం దాటితే ఆ డబ్బు వేస్ట్ అవుతుందంటూ..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టీకా సమయం 6 నుంచి 9నెలల వరకే ఉంటుందని, ఆ సమయం దాటితే ఆ డబ్బు వేస్ట్ అవుతుందని వ్యాఖ్యానించారు. కోవిడ్ టీకా డ్రైవ్‌లో రూ .35 వేల కోట్లు వృథా చేయవద్దని, ఆ నిధులను దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని కోరారు. వృత్తిరీత్యా డాక్టరైన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లోక్‌సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారతదేశం కొవిడ్ ఎదుర్కోవడంలో ఇతర దేశాల కంటే మెరుగ్గానే ఉందని, అయితే చరిత్రలో ప్రతి వందేళ్లకోసారి ఇలాంటి సమస్య తలెత్తుతోందన్నారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యం పెంపు లాంటి చర్యలు తీసుకుంటే వీటిని ఎదుర్కోవచ్చని చెప్పారు.
ఆయుర్వేద వైద్యులకు 60 రకాల శస్త్ర చికిత్సలపై..
మూడేళ్ల పీజీ కోర్సులు చేసిన ఆయుర్వేద వైద్యులకు 60 రకాల శస్త్ర చికిత్సలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌కు విశ్వజనీనమైన టీకా అసాధ్యమని, తాను కూడా వైద్యుడినేనని, అందుకే తన అభిప్రాయం చెబుతున్నానని వ్యాఖ్యానించారు. వీటితోపాటు వైద్య కళాశాలల ఏర్పాట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల మెరుగు, గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వెళ్లేందుకు వారికి పన్నులు, పరికరాల కొనుగోళ్లు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీలు తదితర అంశాలను ప్రస్తావించారు. అలోపతి, ఆయుర్వేద వైద్యం కలిపి చెబుతున్న మిక్సోపతితో చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 టీకా కోసం కేంద్రం రూ.35వేల కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు..డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు గత ఏప్రిల్‌లో కోవిడ్ -19 బారిన పడి కోలుకున్నారు.
డాక్టర్ వ్యాఖ్యలపై చర్చలు..
మొత్తం మీద డా.సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో, అటు జాతీయ మీడియాలో చర్చకు కారణం అయ్యాయి. మరోవైపు టీడీపీ కూడా ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేసింది. జాతీయ మీడియాలో ప్రచురితమైన వార్తను తెలుగు దేశం పార్టీ అధికార ట్విట్టర్ పేజీ ద్వారా ట్వీట్ చేసింది. కొన్ని సార్లు మాట్లాడి తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకునే కంటే మాట్లాడకపోవడం మంచిదని ట్వీట్ చేసింది.











