పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధిన పాటలకు ఎలాంటి స్పందన లభిస్తోందో కూడా తెలుసు. మరి ఈ పాటలను లైవ్ లో పెర్ ఫార్మ్ చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఈరోజు అదే జరిగింది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప.. పాటలు మంచి విజయాన్ని సాధించాయి.
ఈ పాటలతో మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ లోని దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజీలో నిర్వహించారు. దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు థమన్, గాయకులు హారిక నారాయణ, దీపు, శ్రీకృష్ణ, పృథ్వీ, సాహితి, సుభ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఈ పాటలను లైవ్ లో పాడారు. కాలేజీ విద్యార్థులు కూడా ఈ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇలాంటి అనుభూతే ఈ సినిమా విడుదలయ్యాక థియేటర్లలో కలుగుతుందని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు.
ఇలాంటి పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రికి కూడా థ్యాంక్స్ చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని థమన్ అన్నారు. మణిశర్మ దగ్గర పనిచేసినప్పుడు ఖుషి, గుడుంబా శంకర్, బాలు చిత్రాలకు పనిచేశానని చెప్పారు. ఆయన సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇంతకాలానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదతరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకాబోతోంది.











