నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నామని చెప్పలేని జగన్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పడంపై ఆయన ఎద్దేవా చేశారు. వెనుకబడ్డ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, గంగవరం పోర్ట్, డ్రగ్ కంపెనీలు, కేంద్ర సంస్థలైన బీహెచ్ఈఎల్ వైజాగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాగా చెబుతున్న విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తోందని చెప్పిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో బాటు సీ పోర్ట్ రానుందని చెప్పారు. వీటితో బాటు వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి బంధువులకు సంబందించిన ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు ఇది అధికార వికేంద్రీకరణ కాదు అధికార కేంద్రీకరణ అని రాజు గారు స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను వీరు అభివృద్ధి చేస్తామని చెప్పడం పెద్ద కామెడీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ దర్శకులైన జంధ్యాల, ఈవీవీ, బసు భట్టాచార్య సినిమాలలో ఉన్న కామెడీ సన్నివేశాల కంటే వైసీపీ ప్రభుత్వం కామెడీ చేస్తుందని ఆయన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. విశాఖ వాసులు శాంతిని కోరుకుంటున్నారని రౌడీ ఇజాన్ని సహించలేరని తెలిపిన ఆయన వారి మానాన వారిని వదిలేయాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు ను అమరావతిలోనే ఉంచి లెజిస్లేటివ్ క్యాపిటల్ ను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయండని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న ప్రాంతంలో పెట్టి పరిశ్రమలను తీసుకురండని హితువు పలికారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వస్థలమైన పులివెందులలో పెట్టుకోవచ్చని ఆయన పరోక్షంగా కామెంట్ చేశారు.
అమరావతి విషయంలో హైకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై మాట్లాడుతూ ఆ నిర్ణయం ఎంతో బాధకలిగించిందని అన్నారు. కానీ అఫిడవిట్ లో కొన్ని సానుకూల విషయాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సీఆర్డీఏని రద్దు చేస్తున్నామనే అంశం తమకు తెలియదని కేంద్రం చెప్పిందని ఆయన అన్నారు. ఇలాంటి కీలక విషయాలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోమని మాత్రమే చెప్పిందని రాజధానులు అని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అమరావతి, ఆ ప్రాంత రైతులకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.