సుశాంత్ సింగ్ మరణాన్ని మరువకముందే మరో హత్యకు కుట్రకోణం బహిర్గతం కావడం బాలీవుడ్ ను వణికిస్తోంది. హంతకుడు హత్య చేయాలనుకున్న వ్యక్తి సల్మాన్ ఖాన్ కావడంతో ఈ వార్త సంచలనం కలిగించింది. బాలీవుడ్ కి ఇలాంటి కుట్రలు కొత్త కాదు. ఒకప్పుడు టి సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఇలాగే హత్యకు గురయ్యారు. సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి హత్యలు, బెదిరింపుల వెనుక మాఫియా ఉంటుంది. ఇటీవలి కాలంలో మాఫియా ఆగడాలు కనుమరుగయ్యాయి.
ఓ షార్ట్ షూటర్‌ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్యకు కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన ఓ షార్ప్ షూటర్‌ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతడు హత్య చేయబోయే వ్యక్తుల జాబితాలో తదుపరి పేరు సల్మాన్ ఖానేనని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. సదరు షార్ప్ షూటర్ ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంట్ వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలిసింది.
సల్మాన్ ఖాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన షార్ప్ షూటర్ రాహుల్ తాను రెక్కీ పూర్తి చేసిన తర్వాత రెక్కిలో కనుగొన్న విషయాలను బిష్ణోయ్‌కి చేరవేశాడు. అయితే అనుకోకుండా కరోనావైరస్ వ్యాపించడం, ఆ తర్వాత పరిణామాలతో తన ప్లాన్ ను అతను అమలు చేయలేకపోయాడని తెలుస్తోంది. సల్లూ భాయ్ పై హత్యాయత్నం 2018లో కూడా జరిగింది. ఇదే గ్యాంగ్‌కి చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్ సల్మాన్‌ని హత్య చేసేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ నిర్వహించాడు. అనుకోకుండా సంపత్ అరెస్ట్ అవడంతో అతడి ప్లాన్ వర్కౌట్ కాలేదు. కరోనా వ్యాప్తి అనంతరం లాక్‌డౌన్ సమయంలో పన్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌లో 4 నెలల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అయిన సల్మాన్ ఖాన్ ఇటీవలే మళ్లీ ముంబైకి తిరిగొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ షో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.