వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏరి కోరి ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా నియమించిన దేవేందర్‌రెడ్డిపై రాజు గారు మండి పడ్డారు. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు, స్వపక్షంలో విపక్షమంటూ, మాటతో సరిపెట్టుకునేదానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్టేనా? విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో?’ అని దేవేందర్ రెడ్డి రఘురామ కృష్ణంరాజు పై పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు పై మండిపడ్డ ఆయన పార్టీలో పని చేసే వారికి ప్రభుత్వ బాధ్యతలు అప్పచెబితే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేయకుండా తన జట్టుపై కామెంట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
‘నువ్వు నిలబడినా నా బొడ్డు వరకు రావు. అలాంటి నీకు నా జుట్టు ఎలా కనబడింది? నా జుట్టు ఎలా ఉంటే నీకెందుకు? నా జుట్టు నా ఇష్టం. అందరూ నీలానే అంద విహీనంగా ఉండాలని కోరుకుంటే నేనేమి చేయలేను” అంటూ రాజు గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను ప్రభుత్వ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆయన దేవేందర్‌రెడ్డిపై ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఆయన ఎంపీపై పోస్టులు చేయడమేంటనీ ఆయన ప్రశ్నించారు. ఆ పోస్టులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తే పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి వెళ్తానని ఆయన హెచ్చరించారు.
గత కొన్ని రోజులుగా పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ వస్తున్న ఆయన తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై జోకులు వేశారు. కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డికి ఇంటెలిజెన్సు చీఫ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణయంపై స్పందించిన ఆయన మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలోని డైలాగ్ ను వాడారు. ఒకే సామాజిక వర్గానికి కీలక పదవులను ప్రభుత్వం అప్పగిస్తోందిని ‘ఏ మళ్ళీ వేసేశాడు’ అంటూ ఓ సైటేర్ వేశాడు. వరుసగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజు గారు జోరులో ఉండగా ఆయనను అడ్డుకోలేక వైసీపీ ప్రభుత్వం చేష్టలుడిగిపోతోంది.