విశాఖ నగరంలో నాలుగు ఎమ్మెల్యే సీట్లుంటే అన్నీ తెదేపానే గెలిచింది. కానీ ఏంటి ప్రయోజనం. ఒకరు ప్రస్తుతం సుప్త చేతనావస్థలో ఉన్నారు. ఒకరు పార్టీ మారిపోయినట్టే. మరొకరు రాజీనామా అక్కర్లేదంటే మారడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగో ఎమ్మెల్యే కోసం ఏకంగా ఒక మంత్రి మంతనాలు సాగిస్తున్నారు. ఏడాదిన్నర గడిచేసరికి విశాఖ నగరంలో పార్టీల బలాబలాలు ఉల్టా పల్టా అయిపోయినట్టుంది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడానికి, స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీ వైఎస్సార్ సీపీ తనదైన రాజకీయాన్ని ప్రారంభించింది. నగరంలో బలంగా ఉన్న టీడీపీని దెబ్బ కొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేల పై కన్నేసింది. ఇప్పటికే అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ను తమ వైపునకు తిప్పుకుంది. ఆయన ఇద్దరు కుమారులకు వైఎస్ఆర్ సీపీ తీర్థం ఇచ్చింది. టిడిపి అర్బన్ బాధ్యతల నుంచి తప్పుకునేలా చేయించింది.
తరువాత ఫిరాయింపుల రేసులో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఉన్నట్టు ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు కాకుంటే.. రేపైనా పార్టీలో చేరడం ఖాయం. ఇక మిగిలింది వెలగపూడి రామకృష్ణబాబు. మిగిలిన ముగ్గురు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికితే… ఒంటరిగా నగరంలో ఆయన పోరాటం.. అడవి కాచిన వెన్నెల అవుతుందనడంలో సందేహం లేదు. దీంతో ఆయన కూడా పార్టీ మారడం.. లేక స్తబ్దుగా ఉండడమో తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఆయనను వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నాని తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఒక దెబ్బకు రెండు పిట్టలు..
విశాఖ నగరంలో ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడం వల్ల ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అధికార పార్టీ పథకం రచించింది. స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడం అధికార పార్టీకి సవాలు అనే చెప్పాలి. నగరంలో ఉన్న నాలుగు ప్రధాన నియోజకవర్గాలు టీడీపీ ఎమ్మెల్యేలు కైవసం చేసుకోవడంతో మెజారిటీ వార్డులు టీడీపీ దక్కించుకునే అవకాశం ఉందని ఇంతకాలం టిడిపి అంచనా వేస్తూ వచ్చింది.
విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించాక … మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం అధికార పార్టీకి ఎంతో కీలకం కానుంది. అదేవిధంగా పరిపాలన రాజధాని అంశంపై వ్యతిరేకత లేకుండా చేసుకునేందుకు ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. ఒక వ్యూహంతో 2 టార్గెట్లు చేదించడం లో వైసిపి సఫలం అయ్యేలా కనిపిస్తోంది. ఆరంభంలో జీవీఎంసీ మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేవారు. తరువాత కాలంలో మేయర్ ఎన్నిక పరోక్షం అయ్యింది.
ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం.. రాబోయే స్థానిక ఎన్నికల్లో మేయర్ స్థానానికి కూడా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలి అన్న ఆలోచన చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. నగరంలోని నలుగురు ఎమ్మెల్యేలను కోల్పోవడంతో… ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్ ఎంపిక చేయడం ద్వారా గెలుపు ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవసరం లేదని స్పష్టమవుతోంది. దీంతో మేయర్ ఎంపిక రాబోయే ఎన్నికల్లో పరోక్షంగానే జరిగినా.. వైఎస్సార్ సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.
రాజీనామా చేయాల్సి వస్తే..
వైఎస్సార్సీపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేయాల్సిందేనని ఆ పార్టీ గతంలో స్పష్టం చేసింది. అయితే తాను మళ్ళీ పోటీ కైనా సిద్ధమని ఇప్పటికే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి గణబాబుకు ఎదురైతే ఆయన వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈ ఐదేళ్లు గడిపితే చాలు అన్న ధోరణి ఆయనలో, ఆయన కేడర్లో కనిపిస్తోంది.











