ఎస్సీ నియోజక వర్గమైన తుంగతుర్తిలో కుల పోరు తీవ్రతరమైంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి రెడ్డి వర్గానికి ప్రాధన్యత ఇస్తూ దళిత నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ నియోజక వర్గంలో దామోదర్ రెడ్డి జోక్యం చేసుకోవడమేంటని తుంగతుర్తి కాంగ్రెస్ ఇంచార్జి అద్దంకి దయాకర్ మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్కకు దయాకర్ ఫిర్యాదు చేశారు. రెడ్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ దళిత నాయకులపై దామోదర్ రెడ్డి అనుసరిస్తున్న విధానం పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు గాంధీభవన్ లో ఇవాళ భట్టి నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు ప్రీతం కుమార్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు హాజరైయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్ను దన్నుగా నిలుస్తున్న దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
2014, 2019 ఎన్నికలలో తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్ పరాజయం పాలైయ్యారు. వరుసగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో నియోజక వర్గంలో కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో పడిపోయారు. వారిలో భరోసా నింపేందుకు దయాకర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దామోదర రెడ్డి నియోజక వర్గంలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా కూడా చేశాడు. 2009లో నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా తుంగతుర్తి ఎస్సీ నియోజక వర్గంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సూర్యాపేట నియోజక వర్గానికి మారవలసి వచ్చింది. సూర్యాపేట నుంచి రెండు సార్లు పోటీ చేసిన ఆయన వరుసగా జగదీశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరును లేవనెత్తారని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో భట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.










