ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తున్న వేళ మూడు పడవలు బ్యారేజీ గేట్లను గుద్దుకున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మూడు గేట్ల కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. వాటి స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్లు తయారు చేయించి కొన్ని గంటల్లోనే ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తోంది. ఇదిలా ఉంటే.. అసలు పడవలు బ్యారేజీని ఢీకొనడం వెనక భారీ కుట్ర దాగి ఉందని అంటున్నారు. ఆ మూడు పడవలు వైసీపీ నేతలకు చెందినవే అని స్పష్టంగా అర్థం అవుతోంది. సదరు పడవలకు వైసీపీ జెండా రంగులు వేసి ఉన్నాయి. ఆ పార్టీ నేత తలశీల రఘురాం బంధువుకు చెందిన పడవలుగా చెబుతున్నారు.
తాజాగా బోట్ల యజమానుల సంఘం అధ్యక్షుడు చెబుతున్న వివరాలను బట్టి.. ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడని జల సమాధి చేయటానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలు అయ్యిందని తెలుస్తోంది. జగన్ నమ్మిన బంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కి చెందిన మూడు వైసీపీ బోట్లని ఒకదానికి ఒకటి కట్టేసి, మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేశారని ఆయన అంటున్నారు. సరిగ్గా బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే, ఇలా చేసి బ్యారేజీ కూల్చేయాలని జగన్ రెడ్డి క్రిమినల్ ప్లాన్ వేశాడని ఆరోపణలు చేశాడు. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎక్కువ నష్టం జరగలేదు.
అయితే, ఇలా పడవలు ఢీకొన్న వ్యవహారాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు విచారణ మొదలు పెట్టటంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రి పారిపోయారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. బోట్ల యజమానులు చెబుతున్న వివరాల ప్రకారం.. వరద తాకిడి భారీగా ఉన్న సమయంలో యజమానులు తమ బోట్లను బందోబస్తుగా తాడుతో కట్టేసి ఉంచుతారు. కానీ, భారీ బోట్లను ఒకదానికొకటి కట్టేసి ప్రకాశం బ్యారేజీ వైపు వదిలేశారు. ఇలా ఒకదానికొకటి పడవలు తాడుతో కట్టేసి ఉండడం చాలా అనుమానాలకు తావిస్తోంది. వాటిలో ఒక్కో బోటు బరువు దాదాపు 40 టన్నుల వరకూ ఉంటుంది. అసలే వరద తాకిడి అధికంగా ఉండడం వల్ల బ్యారేజీపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది.
అలాంటి సమయంలోనే భారీ బరువున్న బోట్లను కలిపి కట్టేసి ప్రకాశం బ్యారేజీ వైపునకు వదిలారు. నీటి ప్రవాహం వేగం ఒకవైపు, దాని ద్వారా బ్యారేజీపై కలుగుతున్న ఒత్తిడికి తోడు.. ఆ ప్రవాహ వేగానికి మరింత వేగంగా వస్తున్న బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయాలనేది పథక రచనగా చెబుతున్నారు. కానీ, అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం కలగకుండా.. కేవలం కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ జరిగాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌంటర్ వెయిట్లు సరిదిద్దుతోంది. మరోవైపు, ఈ వ్యవహారం వెనుక కుట్ర కోణాన్ని కూడా అధికారులు వెలికితీసే పనిలో ఉన్నారు