విజయవాడలో సంభవించిన నేచురల్ డిజాస్టర్ కారణంగా అతలాకుతలం అయిన పరిస్థితులను తిరిగి సాధారణ స్థితికి తెచ్చేలా చంద్రబాబు పని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా అత్యంత సమర్థంగా పని చేస్తున్నప్పటికీ, అటు కేంద్రం నుంచి సహకారాన్ని తేవడంలో చంద్రబాబు సఫలీకృతం అవుతున్నారు. విజయవాడలో జరిగిన విలయానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా నియమించిన అధ్యయన టీమ్ మాత్రమే కాక, కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పరిశీలనకు గురువారం వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడమేకాక, ఏరియల్ సర్వే కూడా చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చౌహాన్ ఏపీకి కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని.. 2 లక్షల మంది రైతులు నష్టపోయారని చౌహాన్ తెలిపారు. జరిగిన నష్టంపై తాము పంపిన నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ, దీర్ఘకాలిక సాయం తప్పకుండా అందుతుందని చౌహాన్ వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ ఆదేశంతో తాను, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ఇక్కడికి వచ్చామని.. నష్టంపై పూర్తి అంచనాకు వచ్చాక కేంద్రం నుంచి తప్పకుండా సాయం అందుతుందని చౌహాన్ వెల్లడించారు.
విజయవాడలో సహాయ కార్యక్రమాలు సహా, పరిస్థితులను మామూలు స్థితికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని చౌహాన్ కొనియాడారు. ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్‌నే సెక్రటేరియట్ గా మార్చుకుని రేయింబవళ్లు పని చేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. భారీగా ఆస్తి, పంటనష్టం జరిగినా.. ప్రాణనష్టం కొద్దిగానే ఉండటానికి కారణం వీరి పనితనమే అని చెప్పారు. ప్రభుత్వం ఇలా సమర్థంగా పనిచేయకపోతే ప్రాణనష్టం ఎంత జరిగి ఉండేదో ఊహించలేమని చెప్పారు.
వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాల్నీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. డ్రోన్ల ద్వారా పాలు, మంచి నీళ్లు, ఆహారం అందజేయడం తాను మొదటిసారి చూస్తున్నానని చౌహాన్ చెప్పారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రులు పంపిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు బాధితుల్ని కాపాడటంలో పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పారు. అయితే, విజయవాడకు కేంద్రం నుంచి పరిశీలనకు ఇలా కేంద్ర మంత్రిని రప్పించడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు. విజయవాడలో జరిగిన నష్టానికి తగిన ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచే ఇప్పించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పూర్తి నివేదిక సిద్ధం అయ్యాక, అవసరమైతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తగిన ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీని అడగనున్నట్లు తెలుస్తోంది.