వైసీపీ అధినేత జగన్..అటు ఎన్డీఏ కూటమిలో లేరు, ఇటు ఇండియా కూటమిలోనూ లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం ఆసాధ్యం. అలా అని ఆయన ఇండియా కూటమిలోనూ చేరే పరిస్థితి లేదు. ఐతే ఆయనకు అవసరమైన సందర్భంలో ఇండియా కూటమి మద్దతుగా నిలిచింది. ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండియా కూటమిలోని పార్టీ నేతలందరూ వచ్చి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు పలకేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు.
అధికారంలో ఉన్న టైంలో పరోక్షంగా ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారు. ఏ విషయంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సమర్థించలేదు. తాజాగా డీలిమిటేషన్ విషయంలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మెజార్టీ దక్షిణాది పార్టీలు డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే చెన్నైలో దక్షిణాది పార్టీలతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. దక్షిణాది రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఐతే జగన్ ఈ భేటీకి కూడా దూరంగా ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. చివరకు తెలంగాణలో అధికార కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ డీఎంకే ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరయ్యారు. కానీ జగన్ మాత్రం అంత ధైర్యం చేయలేకపోయారు.
స్టాలిన్‌తో జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ ఒకరు. రాజకీయంగా బీజేపీతో పోరాడదామని స్టాలిన్ ఇచ్చిన పిలుపును జగన్ పెడచెవిన పెట్టారు. డీలిమిటేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి సైతం జగన్ వణికిపోతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే తన పరిస్థితి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే బీజేపీని ఢీకొట్టే ప్రయత్నం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చేయట్లేదు జగన్. హస్తినలో NDA కూటమికి మద్దతు తెలియజేయడానికి జగన్ ఏ మాత్రం వెనుకాడడం లేదు.
ఐతే జగన్ తీరుపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదో ఓ అభిప్రాయం కచ్చితంగా ఉండాలని, ఐతే లెఫ్టా, రైటా విధానంతో ముందుకు వెళ్లాలంటున్నారు. కానీ జగన్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలకు పాలుపోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే తాను జైలుకు పోతానని జగన్ భయపడుతున్నారు. అందుకే రిస్క్ తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది.