విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్‌కు లేఖ రాసినట్లు చొక్కాకుల ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ స్థాపించిన కొద్ది రోజులకే పార్టీలో చేరారు వెంకటరావు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉత్తరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, భాజపా నేత విష్ణుకుమార్‌రాజు చేతిలో ఓడిపోయారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంకటరావు భార్య లక్ష్మి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. తర్వాత అదే సంస్థకు చొక్కాకుల ఛైర్మన్‌గానూ పని చేశారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న చొక్కాకుల..వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలుచేశారు చొక్కాకుల. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రాభివృద్ధిని జగన్ గాలికి వదిలేశారని, తిరిగి ప్రజలు జగన్‌కు ఓటేసే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతానికా తాను ఏ పార్టీలో చేరడం లేదని, భవిష్యత్తులు అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.