జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ‘పెళ్లి’. రెండు జీవితాలను ఏకం చేసి ముగింపువరకూ కలిసి నడిపించే ముహూర్తం పెళ్లి. పచ్చని తోరణాలు .. వేదమంత్రాలు .. మంగళ వాద్యాల మధ్య మనసులను కట్టేసే మాంగల్యం పెళ్లి. అనుబంధాన్ని అగ్నిసాక్షిగా నిర్ణయించి, పెద్దల ఆశీస్సులతో పెనవేసుకుపోయే హృదయాల అల్లిక పెళ్లి. అంతటి ముఖ్యమైన ‘పెళ్లి’ని ప్రధాన కథావస్తువుగా చేసుకుని తెలుగు తెరపై చాలా కథలు సందడి చేశాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ కనిపిస్తుంది.
శ్రీకాంత్ హీరోగా 1996 .. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటితో 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ ను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టడమే కాదు, ఆయనకి ఈ సినిమా తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. 100 సినిమాలను పూర్తి చేసేంత ప్రోత్సాహాన్ని శ్రీకాంత్ కి ఇచ్చిన చిత్రంగా ‘పెళ్లి సందడి‘ని పేర్కొనవచ్చు. శ్రీకాంత్ సరసన రవళి .. దీప్తి భట్నాగర్ కథానాయికలుగా అలరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, రెండు కుటుంబాలు .. మూడు మనసులకు సంబంధించిన కథగా చెప్పుకోవచ్చు.
అశ్వనీదత్ – అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, బలమైన కథాకథనాలతో సాగుతుంది. కథానాయకుడైన విజయ్ కృష్ణ (శ్రీకాంత్)కు తరచూ కలలో ఒక అందాలరాశి కనిపిస్తూ కవ్విస్తూ ఉంటుంది. దాంతో అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అతను ఆరాటపడుతుంటాడు. ఒక పెళ్లిలో స్వప్న(దీప్తి భట్నాగర్)ను చూసిన ఆయన, తన స్వప్నసుందరి ఆమెనే అని గ్రహించి మనసు పారేసుకుంటాడు. అతని చూపుల చిక్కుముడిలో ఆమె హృదయం కూడా బిగుసుకుపోతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు .. అందమైన లొకేషన్స్ ఎంచుకుని మరీ విహరిస్తుంటారు. ఈ లోగానే విజయ్ కృష్ణ పెళ్లిని అతని తండ్రి కల్యాణి (రవళి)తో ఖాయం చేసేస్తాడు. అయితే స్వప్న – కల్యాణి అక్కాచెల్లెళ్లు కావడమే ఈ కథలోని ట్విస్టు.
స్వప్నను ప్రేమించిన విజయ్ కృష్ణ, కల్యాణిని పెళ్లిచేసుకోనని ఆమె తండ్రికి చెప్పేస్తాడు. తన కారణంగా తన అక్కయ్య పెళ్లి చెడిపోవడం ఇష్టం లేని స్వప్న, తనకి ‘కేన్సర్’ అని అబద్ధం చెప్పేసి కల్యాణితో పెళ్లికి విజయ్ కృష్ణను ఒప్పిస్తుంది. తను కల్యాణికి చెల్లెలిని అనే విషయాన్ని దాచేసి తప్పుకుంటుంది. కల్యాణితో విజయ్ కృష్ణ పెళ్లికి రంగం సిద్ధమవుతుంది. చివరి నిమిషంలో, స్వప్నను ప్రేమించిన ఒక యువకుడి ద్వారా నిజం బయటపడుతుంది. స్వప్న – కల్యాణి అక్కా చెల్లెళ్లనీ, స్వప్నకి ఎలాంటి జబ్బూ లేదనే విషయం తెలిసి విజయ్ కృష్ణ నివ్వెరపోతాడు. అందరి సమక్షంలోనే ఆ నిజం బయటపడటంతో, కల్యాణి ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది. విజయ్ కృష్ణ – స్వప్నలకు అదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తుంది.
Must Read ;- మరోసారి కెమెరాకి చిక్కిన ప్రేమజంట కియరా, సిద్ధార్ధ్ మల్హోత్రా
ప్రేమ – పెళ్లికి సంబంధించిన ఈ కథలో అక్కాచెల్లెళ్ల త్యాగం ప్రధానంగా కనిపిస్తుంది. ఒకరి ఆనందం కోసం ఒకరు తమ సంతోషాన్ని పణంగా పెట్టడానికి పడే తాపత్రయం కనిపిస్తుంది. వాళ్ల అందాలు .. అనుబంధాలు .. ఆనందాలు .. ఆవేదనలే ఈ కథను నడిపిస్తూ వెళతాయి. ఇక ఆంధ్ర ప్రాంతం వైపు పెళ్లిళ్లు ఎంత సరదాగా .. సందడిగా జరుగుతాయనేది రాఘవేంద్రరావు కళ్లకు కట్టారు. పెళ్లి మర్యాదల్లోనే కావలసినంత కామెడీని పరిగెత్తించారు. “కాఫీలు తాగారా .. టిఫినీలు చేశారా?” అంటూ సాగే కామెడీని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇక ఈ సినిమా విజయంలో కీరవాణి సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేశారు. ప్రతిపాటా పంటచేల మధ్యలో నుంచి సాగే ఆహ్లాదకరమైన బాటలా సాగుతుంది.’సౌందర్యలహరి .. స్వప్న సుందరి .. ‘ అనే పాట ఇప్పటికీ జనం గుండెల్లో జేగంటలా మోగుతూనే ఉంటుంది. వేటూరి .. సిరివెన్నెల .. చంద్రబోస్ అందించిన సాహిత్యం .. పాటకు పసిడితనాన్ని అద్దుతూ వచ్చింది. ఆనందం .. ఆవేదన .. ఉద్వేగం .. ఉత్సాహం నిండిన పాటలను సందర్భోచితంగా రాఘవేంద్రరావు ఆవిష్కరించిన తీరు అద్భుతం – అసమానం. అన్నీ సమపాళ్లలో కుదిరిన ‘ఉగాది’ పచ్చడిలా ఉండటం వల్లనే ఈ సినిమా అంతటి వినోదాన్ని పంచింది! అనూహ్యమైన విజయాన్ని సాధించింది!!
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న క్రేజీ ప్రేమజంట ..!