హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. గతంలో పోలీస్ అధికారి.. సీఐ హోదాలో ఉండేవారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డితో కయ్యానికి పోయి.. జగన్ కంట్లో పడ్డారు. ఏకంగా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల నాలుకలు కోస్తామని అప్పట్లో మాధవ్ మాట్లాడేవారు. ఆ మాటలు జగన్ ను ఆకర్షించి.. హిందూపురం ఎంపీ టికెట్ గోరంట్ల మాధవ్ కు ఇచ్చారు. అప్పుడు వైసీపీ స్వింగ్ వల్ల గోరంట్ల గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రభావితం చేసే కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. గోరంట్లకు అప్పుడు బాగా కలిసి వచ్చింది.
ఐదేళ్ల తర్వాత ఇప్పుడు గోరంట్ల మాధవ్ కు జగన్ మార్క్ ట్రీట్మెంట్ దక్కనున్నట్లు సమాచారం. ఐదేళ్ల నాడు ఎలాగైతే జగన్ మెచ్చి సీటిచ్చారో.. ఇప్పుడు అసహ్యంతో సీటు రిజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత ఉందనే సర్వే రిపోర్టులను జగన్ బాగా నమ్ముతున్నారు. అప్రమత్తం అవుతూ పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయం పట్టించుకోకుండా తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. అయితే, ఆ లిస్టులో గోరంట్ల మాధవ్ కూడా ఉన్నట్లు సమాచారం. అసలే గోరంట్ల ఆ మధ్య పాడు చేష్టలతో దేశమంతా పార్టీ పరువును గంగలో కలిపాడు. ఓ మహిళతో ఫోన్ కాల్ వివాదం మెడకు చుట్టుకొని ఉంది. బట్టల్లేకుండా ప్రైవేటు పార్ట్‌లను వీడియో కాల్ లో చూపించిన వీడియో దేశమంతా చూసింది. మరోవైపు, అనంతపురం జిల్లాలో కియా ఉద్యోగులను బెదిరించడం లాంటి అంశాలు కూడా గోరంట్ల మాధవ్ పైన ఉన్నాయి. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది.
పోలీసు ఉద్యోగంలో దూకుడు ప్రదర్శించి.. వైసీపీ అధినేతను మెప్పించి.. అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గోరంట్ల మాధవ్.. అంతే వేగంగా రాజకీయాల్లోంచి కనుమరుగు అయ్యే అవకాశాలు లేకపోలేదు. వైసీపీ అధిష్ఠానం కనుక కనికరించి ఈసారి ఏదో ఒక టికెట్ ఇవ్వకపోతే ఇక గోరంట్ల మాధవ్ రాజకీయ కెరీర్ క్లోజ్ అని భావిస్తున్నారు. అప్పట్లో జగన్ ఎంపీ టికెట్ అనగానే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ఛటుక్కున జగన్ వెంటకు వచ్చేశారు. ఇప్పుడు జగన్ మొండి చేయి చూపుతుండంతో ఇక గోరంట్ల మాధవ్ పొలిటికల్ కెరీర్ ముగిసిపోవడమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే.. గోరంట్ల మాధవ్ కు మరో పార్టీలో చేరే అవకాశం ఏ కోశానా లేదు. ఏ పార్టీలోకి వెళ్లాలన్నా తలుపులు క్లోజ్. ఎందుకంటే ఆయన నోటి దూలతో అన్ని పార్టీలను అనరాని మాటలు అని.. అవకాశాలు లేకుండా చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుండగా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందనే మాట వినిపిస్తోంది. అందుకే అనంతపురం జిల్లా అభ్యర్థుల విషయానికి వస్తే.. దాంట్లో గోరంట్ల పేరు తొలి స్థానంలో ఉంటుంది. దీంతో ఇప్పుడు గోరంట్ల పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది.