నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి దాన్ని అడ్డుకోవడం కోసం అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిందో తెలియనిది కాదు. పోలీసులను ఉసిగొల్పి అక్రమంగా టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించడం లాంటి పనులు లెక్కలేనన్ని చేసింది. జగన్ కు తొత్తుగా మారిన జిల్లా పోలీస్ బాస్ లు టీడీపీని ప్రతి చోటా ఇబ్బంది పెడుతూనే వచ్చారు. వైసీపీ నాయకులు దాడి చేస్తే.. టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేయడం లాంటివి కూడా చేశారు. ఈ అంశంపై చంద్రబాబు, లోకేశ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. లోకేశ్ మాత్రం జగన్ అండదండలతో టీడీపీ కార్యకర్తల్ని వేధించిన పోలీసులను ఊరికే వదలిపెట్టబోమని తేల్చి చెబుతూ వస్తున్నారు. వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, టీడీపీ అధికారంలోకి రాగానే వారి ఉద్యోగాలు ఊడగొడతామని వార్నింగ్ ఇస్తున్నారు. యువగళం పాదయాత్రలో చాలా సార్లు ఈ రెడ్ బుక్ గురించి లోకేశ్ ప్రస్తావించారు.
అయితే ఇప్పుడు మళ్లీ లోకేశ్ రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆ పుస్తకంలో టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టుకున్నవారి వివరాలన్నీ రాసుకున్నానని.. యువగళం ముగింపు సభలో వేదికపై ఆ బుక్ ను చూపించారు. ప్రభుత్వం మారిన వెంటనే రెడ్ బుక్ లోని వారికి బదులు తీర్చే బాధ్యత తానే తీసుకుంటానని, చంద్రబాబు చూసిచూడనట్లు వదిలేసినా తాను మాత్రం వదిలిపెట్టబోనని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం అనకాపల్లిలో యువగళంలో లోకేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబును అకారణంగా 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారని.. ఆ విషయం ఆయన మర్చిపోయినా.. తాను మర్చిపోనని అన్నారు. ఇక సైకోను సింహం ఎలా వేటాడుతుందో చూడండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ చేస్తున్న ఆ హెచ్చరికలకు పోలీసులు తెగ బెదిరిపోతున్నారు. ఆ రెడ్ బుక్ లో సీఐడీ అధికారుల పేర్లు సహజంగానే ముందు వరుసలో ఉంటాయి. దీంతో సీఐడీ అధికారులు భయంతో రంగంలోకి దిగి.. లోకేశ్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. రెడ్ బుక్ అంశాన్ని పిటిషన్ లో ప్రస్తావించి.. దర్యాప్తు అధికారులను లోకేశ్ జైలుకు పంపుతానని బెదిరిస్తున్నారని కోర్టుకు సీఐడీ అధికారులు వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారిని జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. సీఐడీ వాదనలు విన్న న్యాయమూర్తి దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. పేపర్ క్లిప్పింగులు చూపించారు. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టులో సీఐడీ రెండు రకాల పిటిషన్లు వేసింది. నారా లోకేశ్ 41ఏ నిబంధనలు ఉల్లంఘించారని, అరెస్టు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ మెమోను పరిశీలించి ఏసీబీ కోర్టు జడ్జి పక్కన పెట్టేశారు.
అసలు ఆ బుక్ లో నిజంగా రాశారా అనేది క్లారిటీనే లేకుండా, రాసినా ఎవరి పేర్లు ఉన్నాయనేది ఏమీ తెలియకుండా ఈ పిటిషన్ ను విచారణ చేయలేమని ఏసీబీ జడ్జి తోసిపుచ్చారు. అసలు లాజిక్ లేకుండా లోకేశ్ పై సీఐడీ అధికారులు కోర్టుకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు, జగన్ కూడా ఆ రెడ్ బుక్ లో ఏం రాసి ఉందో తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ రెడ్ బుక్ స్వాధీనం చేసుకోవడానికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి.. లోకేశ్ ను అదుపులోకి తీసుకోవచ్చనే ప్లానే వేశారనే వాదన కూడా ఉంది.











