ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియాలో, సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన కేసును విచారించి 2 నెలల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల వచ్చిన తీర్పులపై సోషల్ మీడియా, మీడియాలో కొందరు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై హైకోర్టులో కేసు నమోదైంది. సీరియస్ గా తీసుకున్న హైకోర్టు విచారణ చేపట్టింది.
ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారిపై కేసులు పెడుతున్న పోలీసులు, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా పిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయలేదని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు తీర్పులు నచ్చని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సలహా ఇచ్చింది.
న్యాయమూర్తులపైనే అసభ్య పోస్టులు పెడతారా?
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరుస్తూ రెండు నెలల కిందట సోషల్ మీడియాలో కొందరు అసభ్యకర పోస్టులు పెట్టారు. పూర్తి సమాచారం హైకోర్టుకు చేరడంతో వీరిపై సీరియస్ అయింది. పూర్తి వివరాలు తీసుకున్న హైకోర్టు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వ కూడదని గత వారం ఏజీని ప్రశ్నించింది. ఇవాళ కేసు మరలా విచారించిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
వైసీపీ పెద్దలు కూడా న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు
స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చీరాల వైసీపీ నేత కృష్ణమోహన్ తో పాటు, కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులను తప్పుపడుతూ అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై రాజకీయ విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర పోస్టింగుల క్లిప్లింగులతో సహా కోర్టును ఆశ్రయించారు. వీటన్నింటిని పరిశీలించిన హైకోర్టు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా పిర్యాదు చేశారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని హైకోర్టు సీరియస్ గా పరిగణించింది. ఇవాళ కేసును విచారించిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.











