విద్యార్ధుల ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ భాగానే ఉన్నా సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన విద్యార్ధులపై పోలీసులు పెట్టిన కేసులు చూసి జడ్జి కూడా ఖంగుతిన్నారు. సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులపై పోలీసులు అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.ఈకేసులో పెట్టిన సెక్షన్లు చూసి జడ్డి ప్రశ్నించడంతో పోలీసులు జరిగిన తప్పును గుర్తించారు. అంటే పోలీసులే రిపోర్టు తయారు చేశారా? లేదంటే వారికి ఎక్కడి నుంచైనా ఏఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలనే స్క్రిప్టు అందిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాపీ పేస్ట్ చేసినప్పుడే ఇలాంటి తప్పులు దొర్లే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఇన్ని సెక్షన్ల కింద కేసులా?
సీఎం ఇంటిని ముట్టడిస్తే ఎన్ని కేసులు పెట్టవచ్చో ఏపీ పోలీసులు నిరూపించుకున్నారు. విద్యార్థి నాయకులపై ఐసీపీ 143, 188, 290, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతోపాటు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 బీ, అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్లు, పోలీసు చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం అభియోగాలు మోపారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు చూసి విద్యార్థులు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నిస్తే అత్యాచారయత్నం కేసు ఎలా పెడతారని జడ్జి పోలీసులను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంటే పోలీసులు ఈ రిపోర్టు తయారు చేశారా? లేదంటే విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టాలో అనే కాపీ వారికి ఎవరైనా అందించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల పోలీసుల పనితీరును ప్రతిపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. ఏపీలో ఐసీపీ అమలవుతోందా. వైపీసీ అమలు చేస్తున్నారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: పలాసలో టీడీపీ కార్యకర్త అదృశ్యం.. ఎంపీ నిరసన
గుడ్డెద్దు చేలో పడ్డట్టు
ఏపీలో పోలీసుల పనితీరు అనేక సందర్బాల్లో ప్రశ్నార్థకంగా మారుతోంది. అమరావతి రాజధాని ఉద్యమం చేస్తున్న ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలు వేసి కారాగారాలకు తరలించడం, ఇటీవల టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం చూస్తుంటే పోలీసుల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళితులపై అట్రాసిటీ కేసులు మోపడం దేశంలో ఎక్కడా లేదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దళిత మహిళ అనితపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసింది. పోలీసులు ఆలోచన చేయకుండా వైసీపీ నాయకులు ఏది చెబితే అది చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపకారవేతనాలు అమ్మఒడికి మళ్లిస్తారా
గత ప్రభుత్వం ఏటా విద్యార్థులకు రూ.3200 కోట్ల ఉపకార వేతనాలను చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమ్మఒడి ప్రవేశపెట్టారు. దీంతో ఉపకార వేతనాలకు మంగళం పాడుతూ జీవో 77 విడుదల చేశారు. 12వ తరగతి వరకు అమ్మఒడి పథకం అమలు అవుతుంది. అపైన డిగ్రీ, పీజీలు చేసేవారికి అమ్మఒడి వర్తించదు. అలాంటి వారికి ఉపకార వేతనాలు ఎంతో మేలు చేస్తున్నాయి. వీటిని నిలిపివేయడం ద్వారా పేదలు ఉన్నత చదువులు చదవకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపకార వేతనాలు నిలిపివేసిన ప్రభుత్వం, ఫీజు రీఎంబర్స్ మెంటు కూడా నిలిపివేస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read: నోటికి తాళం : పార్టీ మారితే అంత కష్టమా?