వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలల మధ్య నెలకొన్న ఆస్తుల పంచాయితీ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. షర్మిల తరఫున ఆమె ఒక్కరే పోరాటం సాగిస్తుండగా… జగన్ తరఫున రోజుకో కొత్త బ్యాట్స్ మన్ బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఆదివారం వైసీపీ కీలక నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి జగన్ తరఫున బ్యాటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా మీడియాసమావేశం పెట్టిన సాయిరెడ్డి…షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ పరువు మంటగలిసేలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజశేఖరరెడ్డి మరణంలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉందంటూ సాయిరెడ్డి సంచలనాలకే సంచలనంగా మారిన వ్యాఖ్య చేసి ఈ వ్యవహారంలో కొత్త మంటలను రాజేశారు.
రాజశేఖరరెడ్డి జమానాలో నాడు టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పరిటాల రవీంద్రను హ*త్య చేసిన మొద్దు శీను…మద్దెలచెరువు సూరి తనకు బావ అని, ఆ బావ కళ్లల్లో ఆనందం చూసేందుకే తాను రవిని హ*త్య చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. బావ కళ్లల్లో ఆనందం కోసమేనంటూ ఆ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. సరిగ్గా సాయిరెడ్డి కూడా మొద్దు శీను మాదిరే ఈ డైలాగ్ ను వాడారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే షర్మిల ఇదంతా చేస్తుస్నట్లుగా ఉందంటూ సాయిరెడ్డి థర్డ్ గ్రేడ్ డైలాగ్ వాడారు. అసలు షర్మిల కళ్ల నుంచి వస్తున్నవి కన్నీళ్లు కాదని కూడా ఆయన మరింత చెత్త వ్యాఖ్య చేయడం గమనార్హం. సరస్వతి పవర్ అయినా, భారతి సిమెంట్ అయినా, సా*క్షి మీడియా అయినా..అన్నీ జగన్ సొంత కంపెనీలేనని ఆయన వాదించారు. రాజశేఖరరెడ్డి బతికుండగానే ఈ కంపెనీలు ప్రారంభమైనా… వాటిని జగన్ తన సొంతంగానే ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ కంపెనీల్లో షర్మిల పేరు లేనే లేదని తెలిపారు.
ఇక జగన్ ను ఆకాశానికి ఎత్తే క్రమంలో సాయిరెడ్డి ఇతర వైసీపీ నేతల మాదిరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పెళ్లి అయిన 20 ఏళ్లకు, రాజశేకరరెడ్డి చనిపోయిన 14 ఏళ్ల తర్వాత కూడా షర్మిలపై జగన్ కు ఇంకా ఆత్మీయత అనురాగాలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగానే పలు కంపెనీల్లో వాటాలతో పాటు రూ.200 కోట్ల మేర డబ్బును షర్మిలకు జగన్ ఇచ్చారని తెలిపారు. అయినా కూడా కేవలం రాజకీయ కారణాలతో… వైఎస్ ఫ్యామిలీతో రాజకీయ వైరం ఉన్న చంద్రబాబు లాంటి నేతలతో కలిసి జగన్ ను ఇరుకున పెట్టేందుకు షర్మిల యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక చివరాఖరుగా రాజశేఖరరెడ్డి మరణం వెనుక చంద్రబాబు హస్తం ఉందని కూడా సాయిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మొత్తంగా ఇప్పటిదాకా జగన్ తరఫున షర్మిలను విమర్శించేందుకు వచ్చిన ఏఒక్క నేత చేయని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన సాయిరెడ్డి… తన సొంత పార్టీనే ఇరుకున పడేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రాజశేఖరరెడ్డి చనిపోయిన సందర్భంగా ఆ ఘటనలో రిలయన్స్ హస్తం ఉందంటూ జగన్ సర్కిల్ నుంచి ఓ లీకు వార్త వెలువడగా… వైఎస్ అభిమానులు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ షాపుల మీద పడి విధ్వంసం చేశారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డిది సాధారణ మరణం కాదని, ఆయనను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హ*త్య చేయించారని కూడా నాడు జగన్ క్యాంపు విచిత్ర ఆరోపణలు చేసింది. తాజాగా సాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి… రాజశేఖరరెడ్డి మరణంలో చంద్రబాబు పాత్ర ఉందంటూ ఆరోపించి వైసీపీ, జగన్ పరువుతో పాటు… మొత్తంగా వైఎస్ ఫ్యామిలీ పరువును తీసేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాయిరెడ్డి వ్యాఖ్యలను విన్నవారంతా … తనను తాను కాపాడుకునేందుకు జగన్ తన తండ్రి మరణాన్ని ఏ రీతిన అయినా వాడుకునేందుకు వెనుకాడరని, అందుకు సాయిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.