ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న టీడీపీ యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన నేపథ్యంలో.. ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి లోకేష్. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి గాడిన పెట్టిన లోకేష్.. ఇప్పుడు పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో నిమగ్నమయ్యారు లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ టూర్ కొనసాగుతోంది.
మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో భాగంగా పెరోట్, టెస్లా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని ఆయనకు వివరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరగా.. దానికి రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘టెస్లా’ సంస్థ సీఎఫ్‌వో వైభవ్ తనేజాతోనూ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఆస్టిన్‌లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా బాగా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీనికి టెస్లా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజీలో టెస్లా గ్లోబల్ లీడర్‌గా ఉందని వైభవ్ తనేజా తెలిపారు. రాష్ట్రంలో సౌరశక్తి వ్యవస్థలు, స్మార్ట్‌సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాల అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ అభివృద్ధి, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమల్లోనూ పాలుపంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని టెస్లా సీఎఫ్‌వోకు మంత్రి లోకేష్ కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు APకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రతి లోకేష్ విజ్ఞప్తి చేశారు. త్వరలో విశాఖలో TCS సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోందన్నారు. భారత్‌లో డాటా రెవెల్యూషన్ రాబోతోందని.. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డాటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజినీర్ రాబర్ట్ ఎలెన్‌లతో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో డాటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి లోకేష్ వివరించారు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించామని చెప్పారు. భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. యువతకు రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.