YSR Pellikanuka Scheme Not Implementing In Andhra Pradesh :
నిరుపేద కుటుంబాల ఆడపిల్లలు పెళ్లై.. అత్తారింటికి వెళ్లిన తర్వాత సుఖసంతోషాలతో ఉండేందుకు జగన్ సర్కార్ ‘పెళ్ళి కానుక’ పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, విద్యాకానుక, కాపునేస్తం పథకాలను అమలు చేస్తున్నా.. ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 సెప్టెంబర్ లో పెళ్లి కానుక కింద ఇచ్చే ఆర్ధికసాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు సీఎం జగన్ ఆర్బాటంగా ప్రకటించారు. కానీ నేటి వరకు అమలు కాకపోవడంతో పేదింటి ఆడపడచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట తప్పుతారా?
వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ఏమైందంటూ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదింటి ఆడపిల్లల ఓట్లతో గద్దెనెక్కి, వాళ్లకు ఇచ్చిన మాట తప్పడం సరైంది కాదన్నారు. చాలామంది ఆడబిడ్డలకు పెళ్లై, పిల్లలు పుట్టినా.. పెళ్లి కానుక అందడం లేదని నిలదీశారు. వెంటనే పెళ్లికానుక, కళ్యాణ మిత్ర బకాయిలు విడుదల చేయాలని, లేదంటే చెల్లెమ్మల శాపనార్ధాలకు వైసీపీ ప్రభుత్వం బలి కాక తప్పదని తులసిరెడ్డి అన్నారు.
టీడీపీ హయాంలో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం అమలైంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు అందాయి. 2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పెళ్లికానుక కింద ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడంతో పేదింటి ఆడపిల్లల పరిస్థితి దారుణంగా తయారైందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.