Eluru Municipal Corporation :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కండ బలాన్నే నమ్ముకున్న అధికార వైసీపీ.. ఏపీలోని మెజారిటీ సీట్లను గెలుచుకుంది. అటు పంచాయతీతో పాటు ఇటు మునిసిపాలిటీలను కూడా గంపగుత్తగా గెలుచుకున్న వైసీపీ..పరిషత్ ఎన్నికల్లో మాత్రం కోర్టు జోక్యంతో వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలు జరిగినా.. కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ జరగని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కు ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ అధికార వైసీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కార్పొరేషన్ లో మొత్తం డివిజన్లు 50 ఉండగా.. వాటిలో 3 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆదివారం నాటి లెక్కింపులో 44 డివిన్లను వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ మూడు డివిజన్లలో విజయం సాధించింది. జనసేన సహా ఇతర పార్టీలకు ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా దక్కకపోవడం గమనార్హం. మొత్తం 50 డివిజన్లలో 47 వైసీపీకి చెందినవైతే.. 3 మాత్రమే టీడీపీకి చెందినవిగా ఉన్నాయి.
ఆళ్ల ప్రతిపాదనకు జగన్ ఏమంటారో?
కౌంటింగ్ పూర్తి కాకుండానే ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న వైసీపీ.. మేయర్ అభ్యర్థిపై కసరత్తును ప్రారంభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంతూరైన ఏలూరులో మేయర్ పదవి కోసం చాలా మందే కాసుక్కూర్చున్నారు. వారిలో ఎవరికి పదవి ఇచ్చినా.. మిగిలిన వారు అలిగి కూర్చునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఒక్క చోట కూడా కనిపించని విధంగా ఇక్కడ ఏకంగా ఐదుగురికి మేయర్ పదవిని ఇవ్వనున్నామని అప్పుడెప్పుడో ఆళ్ల నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన మేయర్ పదవిని ఐదుగురికి పంచాలంటే.. ఏడాదికో మేయర్ మారాల్సిందేనన్న మాట. ఈ ప్రతిపాదనకు జగన్ ఏమంటారో? ఎంపికైన వారు ఏడాది తిరక్కుండానే పదవిని అంత ఈజీగా ఎలా వదులుతారోనన్న విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఐదుగురు మేయర్లు ఎవరో?
ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కాపుల ప్రాబల్యం కలిగిన నగరం. కాపులతో పాటు రాజులు, వెలమలు కూడా తమదైన శైలిలో ప్రభావం చూపే ఈ ప్రాంతంలో మైనారిటీ వర్గానికి కూడా చెప్పుకోతగినంత సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. ఆ వర్గాన్నుంచి కూడా పదవిని ఆశించే వారు లేకపోలేదు. మరి ఒక కార్పొరేషన్.. ఐదుగురు మేయర్లుగా ఎవరికి అవకాశం చిక్కుతుందోనన్న అంశంపై అప్పుడే ఆసక్తికర చర్చలకు తెర లేసింది. అయినా ఏడాదికి ఓ మేయర్ మారే ప్రాంతంలో అభివృద్ధి ఏమాత్రం పరుగులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. మరి ఏలూరులో వైసీపీ జమానాలో ఏ మేర అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిందే.











