ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోవడం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని పవన్ విమర్శించారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఆయన కోరారు.ప్రభుత్వం ఉచితంగా రీ-కౌటింగ్ నిర్వహించాలని..సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని జనసేనాని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు. విద్యార్థులు ఫెయిలైతే తల్లిదండ్రులపై నెపం వేయడాన్ని తప్పుపట్టారు.
గురువులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపుల దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి.. విద్యార్ధులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలని పవన్ మండిపడ్డారు.
ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లుల పెంపకం సక్రమంగా లేదని..కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే అతను రైతేకాదని తిమ్మిని బమ్మిని చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా సర్కారు వాదనలు వింటుంటే.. అసహ్యం కలుగుతోందన్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీషులో బోధిస్తున్నాం అంటే సరిపోదని తగినంతమంది బోధన సిబ్బందిని నియమించాలని సూచించారు. అరకొర ఉన్న టీచర్లకు మద్యం షాపులు వద్ద డ్యూటీలు వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్ ప్రశ్నించారు.