2024 ఎన్నికలే టార్గెట్ గా టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమానికి పిలుపునిచ్చిన బాబు పలు జిల్లాల్లో స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వారినే అడిగి తెలుసుకున్న చంద్రబాబు, పన్నుల పేరుతో జగన్ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు.
బాధుడే బాధుడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం, ఆ తర్వాత నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ప్రజలు ప్రభంజనంలా తరలి రావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వియజేయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని టిడిపి చీఫ్ చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ పటిష్టత పై ఫోకస్ పెంచిన బాబు మరికొన్ని కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
ప్రధానంగా ఎన్నికల సమయం వరకు నిత్యం ప్రజల్లో ఉండడంతో పాటు , ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం సాగించాలని ఇప్పటికే పార్టీ నేతలకి బాబు ఆదేశాలు జారీ చేశారు. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పర్యటన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి జిల్లాలోనూ మూడు రోజులపాటు పర్యటిస్తారు.ఈ పర్యటనలు ఈ నెల 15న అనకాపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి. పర్యటనల లోని కార్యక్రమాలను ఇప్పటికే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మొదటి రోజు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ జిల్లా మహానాడు నిర్వహిస్తారు. రెండోరోజు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అవుతారు. మూడో రోజు ఆ జిల్లాలో లేదంటే సమీప జిల్లాల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రోడ్ షో కూడా నిర్వహిస్తారు. ఒక్కో పర్యటనలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శిస్తారు. మొత్తంగా ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.
అలాగే, ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల సందర్భంగా ప్రతి జిల్లాలో మహానాడు సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15న చోడవరంలో అనకాపల్లి జిల్లా మహానాడు సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 16న అనకాపల్లిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. 17న విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమస్యల పరిశీలన, రోడ్‌షోలు ఉంటాయి.
మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గద్దె దించి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగానే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో బాబు జిల్లాల పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ ని నింపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.