వై.ఎస్.విజయసాయిరెడ్డి..నిన్నటివరకు జగన్‌కు అత్యంత సన్నిహితుడు.వైసీపీకి సంబంధించి ఢిల్లీలో అన్ని కార్యకలాపాలు చక్కబెట్టేవాడు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవికి మూడేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు హస్తినలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
ఐతే విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి వై.వి.సుబ్బారెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లాబీయింగ్ ద్వారా కొన్ని పనులు చేసేవారు సుబ్బారెడ్డి. ఆ సమయంలో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఆయన సాధారణ ఎంపీ మాత్రమే. పైగా విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీలో లేరు. అందుకే వైసీపీకి విజయసాయిరెడ్డి లోటును భర్తీ చేయాల్సిన అత్యవసరం ఏర్పడింది.
ఐతే లాబీయింగ్ విషయం అటుంచితే పార్లమెంట్‌లో విజయసాయిని ఇమిటేట్ చేసేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపి అధికారిక మీడియా ఛానల్ సాక్షి ఆఫీసు నుంచి వచ్చిన పేపర్లను పార్లమెంట్‌లో చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐతే సుబ్బారెడ్డి ప్రసంగం విన్న రాజ్యసభ వైస్ ఛైర్మన్ ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నారని, వాటికి ఆధారాలు లేకపోతే రికార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఐనప్పటికీ వినని సుబ్బారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గతంలో విజయసాయిరెడ్డి ప్రసంగాలు కూడా ఇదే ధోరణిలో సాగేవి. సభలో ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా విజయసాయి తన ప్రసంగాలను కొనసాగించేవారు.
ఇక సుబ్బారెడ్డి మాట్లాడిన చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలే. అవి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు. అసెంబ్లీలో మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ముఖం చెల్లడం లేదు. దీంతో ఆ పాఠాలను పార్లమెంట్‌లో అప్పజెప్పుతున్నారు. రికార్డుల నుంచి తొలగిస్తే తొలగించని..తాము చెప్పాల్సింది చెప్తామంటూ ముందుకెళ్తున్నారు. విజయసాయి రాజీనామాతో తమకు పెద్దగా నష్టం లేదని చాటిచెప్పే ప్రయత్నంలో సుబ్బారెడ్డి ముందుకెళ్తున్నారు.











