అసెంబ్లీకి రాకుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శాసనసభ సభ్యత్వం డేంజర్‌లో పడిందా..అంటే అవుననే సమాధానమిస్తున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేసి జగన్ ఇంటిలో కూర్చుంటే నడవదన్నారు. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా హాజరుకాకపోతే శాసనసభ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దవుతుందని సంచలన ప్రకటన చేశారు రఘురామకృష్ణం రాజు.
అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయినా శాసనసభ సభ్యత్వం కాపాడుకోవచ్చన్నారు రఘురామ. ప్రతిపక్షహోదా లేకపోతే సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వరంటూ జగన్ చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మాట్లాడే విషయంలో సబ్జెక్ట్ ఉంటే కచ్చితంగా సభాపతి సమయం ఇస్తారని చెప్పారు. మంత్రులు కూడా వాటికి సమాధానం చెప్తారన్నారు RRR. ఇక స్పీకర్ స్థానంలో మీరు కూర్చుంటే అధ్యక్ష అని మిమ్మల్ని సంబోధించాల్సి వస్తుందనే జగన్ హాజరుకావట్లేదేమో అన్న రిపోర్టర్ల ప్రశ్నకు రఘురామ స్పందించారు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్నా అధ్యక్షా అనాల్సిందేనన్నారు. జగన్ ఇప్పటివరకూ ఎలాంటి సెలవు అభ్యర్థన పెట్టలేదన్నారు రఘురామకృష్ణం రాజు. వరుసగా సభకు 60 రోజులు రాకపోతే పులివెందులకు తప్పకుండా ఉపఎన్నిక వస్తుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత 2024 జూన్ 22న ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత అసెంబ్లీ వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. ఇక అదే ఏడాది జులై 22న అసెంబ్లీ సమావేశాలకు జగన్ నల్లకండువా ధరించి హాజరయ్యారు. టీడీపీ 40 రోజుల పాలనలోనే 30కి పైగా హత్యలు జరిగాయని ఆరోపిస్తూ, సభలో నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. ఇక అప్పటి నుంచి సభకు జగన్ హాజరు కాలేదు. తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టును సైతం ఆశ్రయించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని, సభలో మిగిలిన ఏకైక పక్షం వైసీపీనే కాబట్టి, తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షం అనేది జగన్ వాదన.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. కూటమి దెబ్బకు హేమాహేమీలంతా ఓడిపోయారు. ఇక 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్‌కు ముఖం చెల్లట్లేదు. ఈ కారణం చేతనే ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై గతేడాది జూన్ 20న జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యంలోకి పోతా ఉన్నామంటూ కామెంట్ చేశారు జగన్. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జగన్ సభకు హాజరవుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ హాజరుకాకపోతే వేటు వేయడం ఖాయమని మరోవైపు రఘురామ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడాలి మరీ పులివెందులకు ఉపఎన్నిక వస్తుందో, లేదో.