పోలీసులు నన్ను తోసేశారు. లాఠీచార్జీ చేశారు. కింద పడేశారు. ఈ దేశంలో మోదీ ఒక్కరే నడవాలా? మామూలు మనుషులు నడవడానికి వీల్లేదా?’ అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
తన మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారని, పోలీసులు కింద పడేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ బాధితురాలు చనిపోయింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఢిల్లీ నుంచి యూపీ బయలుదేరారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలను నిలిపివేశారు.
హత్రాస్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే, ప్రస్తుతం పాండమిక్ యాక్ట్ (కరోనా వైరస్ మహమ్మారి కారణంగా) అమల్లో ఉందని, ఈ సమయంలో గుంపులు, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాలను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కారు దిగి నడక ప్రారంభించారు. తాను ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తానంటూ రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘ఇప్పుడే పోలీసులు నన్ను తోసేశారు. లాఠీచార్జీ చేశారు. కింద పడేశారు. ఈ దేశంలో మోదీ ఒక్కరే నడవాలా? మామూలు మనుషులు నడవడానికి వీల్లేదా? మా వాహనాలను ఆపేశారు. దీంతో మేం నడక ప్రారంభించాం.’ అని యమునా ఎక్స్ ప్రెస్ వే మీద రాహుల్ గాంధీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.











