జగన్ మోహన్ రెడ్డి హాయాంలో గనుల మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల గురించి విస్మయం కలిగించే విషయాల బయటికి వస్తున్నాయి. మంత్రి హోదాలో అటు పుంగనూరులోనే కాక, రాష్ట్ర వ్యాప్తంగానూ పెద్దిరెడ్డి తన అరాచకం చూపారని ప్రస్తుత రవాణా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ అండ్ కో అంతా కలిసి రూ.45 కోట్ల విలువైన లక్షా 70 వేల ఎకరాల భూమిని వివిధ చోట్ల కాజేయగా.. ఒక్క పెద్దిరెడ్డి, ఆయన ముఠా చేతిలోనే 15 నుంచి 20 ఎకరాలు ఉంటుందని మంత్రి రాం ప్రసాద్ చెప్పారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం వెనుక అసలు విషయాలను మంత్రి బయటపెట్టారు.
పెద్దిరెడ్డి అధికంగా తిరుపతి, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 15 నుంచి 20 వేల ఎకరాల భూమిని కాజేశారు. ఇప్పుడు అక్కడ చాలా వరకూ భూమి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరుల చేతుల్లోనే ఉందని మంత్రి చెప్పారు. ఇవన్నీ అక్రమంగా కబ్జా చేసిన భూములే అని.. పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర సబ్ కాంట్రాక్టులు సంపాదించి.. చిన్న కాంట్రాక్టర్‌గా జీవితం ప్రారంభించిన పెద్దిరెడ్డి ఇప్పుడు భారీగా అక్రమార్జన వెనకేసుకున్నారని మంత్రి వివరించారు. ఒక్క పులిచర్ల మండలంలోనే 970 ఎకరాలు కొట్టేశారని.. పెద్దిరెడ్డి భార్య పేరుతో నేషనల్ హైవేకి దగ్గర్లో 5 ఎకరాలు ఆక్రమించారని మంత్రి తెలిపారు.
అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో వారి భూ దోపిడీ జరిగిందని మంత్రి చెప్పారు. చెరువులను కూడా ఆక్రమించుకుని వాటికి పట్టాలు పుట్టించారని తెలిపారు. మదనపల్లె ఆర్డీవో పరిధిలోని మొత్తం 14 మండలాల్లో భూకబ్జాలు చేశారు. అవి బయటపడకుండా చూడడానికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు తగులబెట్టించారని చెప్పారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించిన 22ఏ రికార్డులను ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని అన్నారు. అనునాయులకు భూములు కట్టబెట్టించుకొని ఎన్‌వోసీలు ఇప్పించి వాటిని కప్పిపుచ్చడానికి అగ్ని ప్రమాదం నాటకం ఆడారని అన్నారు. ఇంత దారుణంగా దోచుకోవడం వల్లే పెద్దిరెడ్డి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని వివరించారు.
పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ పీఎల్‌ఆర్‌కు చెందిన టిప్పర్లపై విచారణ జరపబోతున్నట్లు తెలిపారు. ఒకే నంబర్‌తో ఈ కంపెనీకి చెందిన టిప్పర్లు 2-3 తిరిగినట్లు ఫిర్యాదులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు వాటన్నింటినీ దాచిపెట్టారని ఆరోపించారు. భూముల రికార్డులు తగలబెట్టిన మదనపల్లెకు వైసీపీ నేత జగన్ వస్తానంటే ఆహ్వానిస్తామని, ఆయనకు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక బెటాలియన్ పోలీసులను భద్రతగా పెట్టుకుని తిరిగారని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీ నేతలకు గన్‌మెన్‌ను తొలగించారని విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయాక కేవలం 10 రోజుల కిందట భద్రత తగ్గిస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు.