ఎన్నో విశిష్టత కలిగిన ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పడు అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొందరు పురావస్తు శాఖ నిపుణులు తవ్వకాలను జరుపుతూ వాటి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈమధ్య పాకిస్తాన్‌లో పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి ఓ ఆలయం బయటపడింది.
వాయువ్య పాకిస్తాన్‌లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘండాయ్ లోయలో గత కొన్ని రోజులుగా ఇటలీకి చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు, పాకిస్తాన్‌కు చెందిన పురావస్తు శాఖ నిపుణులు తవ్వకాలు జరుపుతున్నారు. వారు జరిపిన తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాతనమైన హిందూ దేవాలయం బయటపడింది. ఆ దేవాలయం విష్ణు ఆలయమని పురావస్తు ఖాఖ అధికారి ఫజల్ ఖాలిక్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని 13వందల ఏళ్ల క్రితం హిందూ షాహీస్ అనే వంశస్తులు పరిపాలించారు. వీరిని కాబూల్ షాహీస్ అని కూడా పిలుస్తుంటారు.
Also Read:-గ్రంధ పఠనంతో విలువలతో కూడిన జీవితం : స్వరూపానందేంద్ర
క్రీస్తు శకం 850-1026 మధ్య కాలంలో హిందూ వంశస్తులు గాంధారా, కాబూల్ ప్రాంతాలను పాలించారు. అప్పట్లో వీరు కట్టించిన ఆలయమే ఈ తవ్వకాలలో బయటపడిందని నిపుణులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలలో సైనిక స్థావరాలు, కోట బురుజు, వాచ్ టవర్, అవశేషాలను కూడా అధికారులు కనుగొన్నారు. వీటితో పాటు ఓ పెద్ద కోనేరు కూడా బయటపడింది. భక్తలు ఆలయానికి వచ్చి భగవంతుడి దర్శనానికి ముందు ఆ కోనేరులో స్నానమాచరించేవారట. స్వాట్ జిల్లాల్లో పురావస్తు ప్రదేశాలు చాలానే ఉన్నప్పటికీ పరిశోధకులు జరిపిన తవ్వకాలలో ఓ హిందూ సామ్రాజ్యానికి సంబంధించి విశేషాలు బయటపడడం ఇదే మొదటిసారి అంటున్నారు. అందులోనూ గాంధార నాగరికతకు చెందిన ఆలయం వెలుగులోకి రావడం గొప్పవిశేషమని పురావస్తు శాఖ ఉన్నతాధికారి లుకా గాంధా వెల్లడించారు. అలాగే ఇదే జిల్లాలో గతంలో అనేక బైద్ధ ఆరామాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
Also Read:-బాంబ్ నిర్వీర్యమైంది! .. ‘లక్ష్మి’ మిగిలింది.. !!











