జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, ఖిలాషపురం గ్రామంలో ఓ పురాతన కోట ఉంది. అయితే ఈ కోట గోడ కూలి పక్కనున్న ఇళ్లపై పడింది. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కోట గోడ నానిపోయి కూలినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. కూలిన గోడ గరించి తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం కోటను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే కోట గోడ కూలిపోయిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రా పాలకుల హయాంలో కోటల పరిరక్షణను పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇళ్లపై కూలిన డోగ..
కోట గోడ కూలి పక్కనే ఉన్న ఇళ్లపై పడింది. దీంతో నష్టపోయిన బాధితులు తమ గోడును మంత్రితో వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి… కోట గోడ కూలి నష్టపోయిన ఇండ్ల వారికి పునరావాస ఏర్పాట్లు చేస్తామని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని బాధితులకు మంత్రి భరోసా కల్పించారు.
ఇది ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే..
జనగామ జిల్లాలోని రఘునాథపల్లిలోని ఖిలాషాపురంలో ఈ కోట ఉంది. దీనిని సర్దార్ సర్వాయి పాపన్న 400 ఏళ్ల క్రితం నిర్మించారనే చరిత్ర ఉంది. సర్వాయి పాపన్న బహుజనుల కోసం పోరాటం చేసే యోధుడు. ఆయన పోరాటానికి ప్రతీకగా ఈ కోట నిలిచింది. అయితే ఈ కోటను గత పాలకులు విస్మరించారు. చరిత్ర గల ఈ ప్రాంతాన్ని పరిరక్షించే బాధ్యతను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. అయితే ఇలాంటి కోటలను గుర్తించి వాటిని పరిరక్షించేలా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కోటను పూర్తిస్థాయిలో మరమ్మతు చర్యలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ కోటను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పర్యాటక, పురావస్తు, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి కోట అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు.