జాతీయ కాంగ్రెస్ పార్టీ.. 135 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన పార్టీ. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. దేశ భవిష్యత్తుకి పునాది వేసిన పార్టీ. మహామహులకు పోరాట వేదికగా నిలిచిన పార్టీ. సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముడికి బాసటగా నిలిచిన పార్టీ. నెహ్రూ, శాస్త్రి, ఇందిర లాంటి మహోన్నతమైన ప్రధానులను దేశానికి అందించిన పార్టీ. దేశ దశ, దిశలను సమూలంగా మార్చేసిన పార్టీ. 50 ఏళ్లు ఏకచ్ఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలిన పార్టీ.. నేడు పతనావస్థలో ఉంది. ఉద్దండ నేతలను దేశానికి అందించిన పార్టీ.. నేడు నాయకత్వ లేమితో అంపశయ్యపై ఉంది. రాజకీయ చాణక్యంలో తలపండిన పార్టీ.. నేడు జవసత్వాలు కోల్పోయి నిస్తేజంగా ఉంది.
చరిత్రకు సజీవ సాక్ష్యంగా..
1885 డిసెంబరు 28న ఏవో హ్యూమ్ స్థాపించిన జాతీయ కాంగ్రస్ పార్టీ.. స్వాతంత్ర పోరాట యోధులకు ఓ వేదికలా నిలిచింది. అప్పటివరకు దేశంలో అక్కడక్కడ మాత్రమే వినిపిస్తున్న ధిక్కార స్వరాలన్నీ.. ఈ వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. 1920లో ఇదే వేదిక ద్వారా మహాత్ముడు రంగ ప్రవేశం చేసి.. మొత్తం స్వాతంత్ర్య పోరాట స్వరూపాన్నే మార్చేశాడు. స్వాతంత్ర్య కాంక్ష కలిగిన మహామహులైన నాయకులందరినీ ఒక్కటి చేశాడు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చాడు. మనదంతా ఒకటే దేశం.. భారతదేశం.. అనే స్ఫూర్తిని, స్వాతంత్ర్య కాంక్షని వారిలో రగిలించాడు. నెత్తుటి చుక్క రాలకుండా.. శాంతియుత మార్గంలో మదపుటేనుగుని దేశం నుంచి తరిమికొట్టాడు. ఈ క్రమంలో జరిగిన అనేక చారిత్రక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత.. ఒకానొక దశలో మహాత్ముడు.. పార్టీ రద్దు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చాడని, కానీ, నెహ్రూ సహా మెజార్టీ నాయకులు దానిని వ్యతిరేకించారని చెబుతుంటారు.
నవభారత నిర్మాణానికి పునాది..
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో స్వాతంత్రం సాధించిన తర్వాత.. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ స్థితిలో.. కాంగ్రెస్ పార్టీ దేశానికి దశ దిశలను నిర్దేశించింది. పటిష్ఠమైన రాజ్యాంగాన్ని నిర్మించి, దారిద్ర్య నిర్మూలనకు కృషి చేసింది. నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ల నేతృత్వంలో శాంతియుతంగా 500కు పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసింది. ఆ తర్వాత ఇందిర నేతృత్వంలో తెచ్చిన భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ వంటివి సంచలనమనే చెప్పాలి. దేశం.. ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది కూడా ఇందిర నేతృత్వంలోనే అని చెప్పొచ్చు. అలా.. దేశాభివృద్ధికి పటిష్ఠమైన పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పునాదులపైనే ఆ తర్వాత వచ్చిన ప్రధానులూ నవభారత నిర్మాణాన్ని కొనసాగించారు.
నేడు డీలా.. ఎందుకిలా..
ఇన్నేళ్లపాటు దేశాన్ని శాసించిన, దేశ ప్రజలందరూ శ్వాసించిన పార్టీ.. ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఇప్పటికీ కొందరికి తెలిసిన పార్టీ.. కాంగ్రెస్ మాత్రమే. అలాంటి చరిత్ర కలిగిన పార్టీకి నేడు ఈ దుస్థితి ఎలా దాపురించింది? వేలాది నాయకులను దేశానికి అందించిన పార్టీ.. నేడు సారథి లేక ఎందుకు వెలవెలబోతోంది? మనుగడ కోసం పోరాడాల్సిన స్థితిలో.. ఉనికి నిలుపుకోలేక ఎందుకు కలవరపడుతోంది? అంటే.. నిస్సందేహంగా స్వయంకృతమనే చెప్పొచ్చు. 50 ఏళ్లు పాలించిన పార్టీ.. 135 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ.. నాయకత్వం కోసం నేటికీ కేవలం ఒక కుటుంబంపైనే ఆధారపడడం ఆ పార్టీకున్న ప్రధాన బలహీనత.
కానరాని నాయకుడు.. కనిపించని పోరాటం..
ఈ లక్షణం ఎక్కువగా ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంటుంది. ఓ జాతీయ పార్టీ.. ఈ బలహీనతతో ఎక్కువ కాలం నెగ్గుకురావడం కష్టమని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజార్చేశారని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. ఇందిర, రాజీవ్, సోనియాలకు రాజకీయాలపై ఆసక్తితో పాటు నాయకత్వ సామర్ధ్యం ఉంది కాబట్టి ఇంతకాలం ఈ కుటుంబ రాజకీయం చెల్లిందని, ఇప్పుడు రాహుల్ కు వారసత్వమే తప్ప.. రాజకీయాలపై ఆసక్తి, పరిణతి లేదని వారు అంటున్నారు. అందుకే ఈ కష్టకాలంలో కాడి వదిలేశాడని చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి తగిన నాయకుడు ఆ పార్టీలో ఎవరూ లేకపోవడం.. ఆ పార్టీ దౌర్భాగ్య స్థితిని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యువరక్తం అత్యవసరం..
దేశంలో ప్రస్తుతం ఇన్ని సమస్యలు ఉన్నా.. ఆ పార్టీ నుంచి కనీసం ఒక ఉద్యమం కూడా రాలేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇంతలా పోరాడుతుంటే.. ఉద్యమాన్ని ముందుండి నడపాల్సిన ఆ పార్టీ.. చోద్యం చూస్తోంది. ఎన్ఆర్సీ, కశ్మీర్ సమస్య లాంటి సందర్భాల్లోనూ చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పార్టీకి సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడమే దీనికి కారణం. రాహుల్.. కాడి వదిలేసిన వెంటనే.. ఓ యువనేతకు పగ్గాలు అప్పగించి ఉండుంటే.. పరిస్థితి కచ్చితంగా ఇంత దయనీయంగా మాత్రం ఉండేది కాదు. పార్టీ మారేవాళ్లే తప్ప.. బతికించుకోవాలన్న తపన ఉన్న నాయకులు నేడు ఆ పార్టీలో లేరు. వేలాదిగా యువ నాయకులను తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు తన వయసు లాగే.. వృద్ధ నేతలతో నిండిపోయి ఉంది. దీనికి తిరిగి జీవం పోయాలంటే.. యువరక్తం అత్యవసరం.
ఒక్కమాటలో చెప్పాలంటే.. అగ్రశ్రేణి నుంచి గ్రామీణ స్థాయి వరకు మొత్తంగా పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఓ సమర్ధుడైన యువనేతకు పార్టీ జాతీయ పగ్గాలు అందించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ.. దేశ చరిత్రకు చిహ్నం. భవిష్యత్తుకు పునాది. అలాంటి పార్టీని కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నాటి సంజయ్ గాంధీ లాంటి దూకుడు.. తెలివి కలగలిపిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అత్యవసరం.