గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలోని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహారించారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులు అయితే ఆ పార్టీకి చెందిన బడా నేతలకు బినామీలుగా వ్యవహారించారు. ఈ నేపథ్యంలో వారు ప్రతిపక్షానికి చెందిన నాయకులపై ఇష్టమొచ్చినట్టు తిడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ వేధింపులకు పాల్పడేవారు. పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసేవారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు కూడా జిల్లాల్లో ఇటువంటి నాయకులను ప్రోత్సహించారు. అలాంటి వారిలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకరు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఆయన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్మాదిలా సోషల్ మీడియా వేదికగా వికృతంగా వ్యవహరించారు. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన అరాచకాల గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
జగన్ హయాంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చిన అనిల్ కుమార్.. చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని ఫోన్‌లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై ఆయనతోపాటు అతని అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ కేసులోనే ఈనెల 17న అమరావతిలో అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అనిల్ ఎవరిరెవరిని తిడుతూ పోస్టులు పెట్టాడో.. బెదిరింపులకు పాల్పడిన వాటిపై విచారణ చేస్తున్నారు. దాంతోపాటు అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో కోట్లాది రూపాయల డబ్బులున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. తాడేపల్లి పెద్దల నుంచి అతినికి డబ్బులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై పోస్టులు పెడుతూ.. తిడుతున్నందుకే తాడేపల్లి పెద్దలు నెల నెలా కోట్లాది రూపాయలు పంపించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా పోలీసులు విచారణ చేసి వివరాలను సేకరించనునా్నరు.
బోరుగడ్డ అనిల్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించే క్రమంలో అనిల్ నోరువిప్పారు. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది.. ఎవరి డైరక్షన్‌లో చేయాల్సి వచ్చిందో పోలీసులకి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్ అధికారుల వద్ద అనిల్‌కుమార్ మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. అనిల్‌తో.. నీవు దళితుడివి…నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.. టీడీపీ నేతలను తిడితే తాము అండగా ఉంటామని నాడు ప్రోత్సహించిన వైసీపీ నేతలు ఈ రోజు కేసు నమోదైన సమయంలో ఒక్కరు కూడా పరామర్శకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజు అలా తిట్టడం తన తప్పేనని… ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతానని… తాను అప్రూవర్‌గా మారతానని వేడుకొన్నట్టు తెలిసింది.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు.. అందరినీ అసభ్య పదజాలంతో దూషిస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ పోస్టులు పెట్టేవారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడాను.. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి తాము వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే ఆనాటి విపక్ష నేతలను దూషించానని.. బెదిరింపులకు పాల్పడ్డానని అనిల్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. గత కొంతకాలంగా ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్ అథావాలే వద్ద ఉన్నానని.. ఇప్పుడు తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్ కుమార్ చెప్పారు.
ఇప్పటికే పోలీసు కేసు నమోదైన నేపథ్యంలో.. బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ బాధితులకు భరోసా ఇచ్చారు. అనిల్ కుమార్ తనకు తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొంటున్నాడని.. దానిపై అనేక వివాదాలు ఉన్నాయన్నారు. వర్డ్ అకాడమీ(యూకే) పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్ జైలు కెళ్లొచ్చాడు. ఆ తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడని ఎస్‌పీ తెలిపారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవాడని.. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అనిల్‌ను పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని ఎస్పీ మీడియాకి తెలిపారు.