వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పాదం మహిమ ఆ పార్టీని ఏ రితిన ఇబ్బంది పెడుతోందన్న వైనం ఇప్పుడు విశాఖలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయిరెడ్డిని పార్టీ అధిష్ఠానం ఇటీవలే ఉత్తరాంద్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామకం ఇలా జరిగిందో, లేదో… ఆ వెంటనే విశాఖలో వైసీపీ శిబిరం కకావికలమైపోయింది. ఓ వైపు వైసీపీకి, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజగురువుగా వినుతికెక్కిన స్వరూపానందేంద్ర సరస్వతి నేతృత్వంలోని శారదా పీఠానికి జగన్ సర్కారు కేటాయించిన భూములను వెనక్కు తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు దాదాపుగా నిర్ణయం తీసేసుకుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైపోగా… అతి త్వరలోనేే ఈ ప్రక్రియను పూర్తి చేసి రానున్న కేబినెట్ సమావేశంలోనే దీనిపై తీర్మానం చేయాలని కూడా సర్కారు భావిస్తోంది. ఇక వైసీపీ జమానాలో విశాఖ ఎంపీగా కొనసాగిన ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జగన్ విపక్ష నేతగా ఉన్నప్నపటి నుంచి కూడా విశాఖ శారదా పీఠం అంటే ఆ పార్టీ నేతలకు ప్రత్యేకమనే చెప్పాలి. నాడు జగన్ ఎప్పుడు విశాఖ వెళ్లినా… శారదా పీఠానికి వెళ్లి తన రాజగురువు స్వరూపానందేంద్రుడిని దర్శించుకోనిదే తిరిగి వచ్చే వారు కాదు. 2019 ఎన్నికలకు ముందు అయితే పీఠానికి జగన్ పలుమార్లు వెళ్లడం, తన రాజగురువు వద్ద ఆశీర్వచనాలు తీసుకోవడం మరింతగా పెరిగింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో గెలుపు నీదేనంటూ స్వరూపానందుడు… జగన్ భుజం తట్టి మరీ చెప్పిన వైనం జనానికి గుర్తు ఉండే ఉంటుంది. తన రాజగురువు చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా… జగన్ సీఎం పీఠంపై కూర్చుకున్నారు. మరి పదవి దక్కిన తర్వాత రాజగురువుకు ఏదో గురుదక్షిణి సమర్పించుకోవాలి కదా… అందుకేనెమో విశాఖలో శారదా పీఠం విస్తరణ కోసం స్వరూపానంద కోరిన వెంటనే… నగరంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని నామమాత్రపుధరకు కేటాయించేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా జగన్ వెనక్కు తగ్గలేదు.
మరోవైపు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలటో శారదా పీఠానికి కొంత స్థలం కావాలని, దానితో వెంకన్నకు సేవ చేసుకునే దిశగా ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేస్తామని స్వరూపాందుడు కోరారట. దీంతో ఏమాత్రం ముందూ వెనుకా ఆలోచించని జగన్ సర్కారు., తిరుమల కొండపై కొంత స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించింది. దీనిలో శారదా పీఠం వెనువెంటనే నిర్మాణాలను కూడామొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపైనా దృష్టి సారించిన కూటమి సర్కారు… అసలు కొండపై శారదాపీఠం నిర్మాణాలేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. ఆ వెంటనే టీటీడీ ఈవోగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన శ్యామలరావును పిలిపించి…కొండపై ఆ నిర్మాణాల కథేమిటో తేల్చాలంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారట. ఈ నివేదికకు సీఎం కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఇచ్చారట. నివేదిక అందగానే… వాటిపైనా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇక 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీవీ సత్యనారాయణ… వైసీపీ హవాలో విజయం సాధించారు. పార్టీ అధికారంలో ఉండటం… తాను వ్యాపారస్తుడు కావడంతో ఆయన అందిన కాడికి వెనకేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి,. వైసీపీ అధికారంలో ఉండగానే…ఆయనపై ఈ తరహా విమర్శలు రావడం గమనార్హం. ఈ వ్యవహారంపై నాడు కేసులు నమోదు కాగా… తాజాగా ఆయన ఇల్లు,కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా కూటమి ఎంపీ సీఎం రమేశ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ జమానాలో ఆ పార్టీ నేతలు విశాఖను ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని ఆరోపించారు. ఆ దోపిడీదారులంతా తమకు తాముగా లొంగిపోతే సరేసరి… లేదంటే చట్టం తన పని తాను చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళుతుందని హెచ్చరించారు. విశాఖను దోచిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని కూడా ఆయన తెలిపారు. ఈ పరిణామాలన్నీ… సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మరుక్షణమే జరగడం విశేషం.