మీకందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం మన ప్రధాని మోడీ నవంబరు8, 2016 రాత్రి 8 గంటలకు పిడుగు లాంటి వార్తను దేశ ప్రజలకు చెప్పారు. ఆరోజు అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించడంతో అందరూ నిర్ఘాంత పోయారు. అదే డీమానిటైజేషన్. దీనిపై భారతదేశంలోనే గాక ప్రపంచంలోని ఆర్థికవేత్తల నుంచి అనేక విమర్శలు కూడ వచ్చాయి. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ , ప్రతి పక్షాల అనేక ఆరోపణలు చేసినప్పటీకీ ఈ నిర్ణయం సాహసోపేతమే. అయితే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు అంతగా సమకూర లేదు.
ప్రభుత్వ ఆశయం.. ప్రజల ఇబ్బందులు
బ్లాక్ మనీని నివారించడం, నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం మొదలగు మూడు ప్రధానోద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే,నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని రోజుల పాటు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కట్టక తప్పలేదు. అంతేగాక తగిన కరెన్సీ అందుబాటులో లేక చిన్న చిన్న వ్యాపారాలు వెలవెల బోయాయి. స్వల్ప కాలంలో ఇబ్బందులు పడినప్పటికీ దీర్ఘకాలింగా అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం సమర్థించుకుంది.
బ్లాక్‌మనీ వచ్చేసిందా..?
దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు వేసినప్పటికీ డీమానిటైజేషన్‌తో 1.3 లక్షల కోట్లు మాత్రమే సిస్టమ్‌లోకి వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి19న లోక్‌సభలో ప్రకటించారు. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ.15.41 లక్షల కోట్లలో 99 శాతం అంటే 15.31 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. దీంతో బ్లాక్ మనీ నివారణలో ప్రభుత్వ లక్ష్యం నూరు శాతం సఫలం కాలేదు. బ్లాక్ మనీ నివారణకు డీమానిటైజేషన్ ఒక్కటే సరికాదని కూడ ఆర్‌బిఐ బోర్డు అభిప్రాయపడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
నకిలీ నోట్లు పోయాయా..?
డీమానిటైజేషన్ రెండో ప్రధానోద్దశం నకిలీ కరెన్సీని అరికట్టడం.2016లో దేశంలో వివిధ డినామినేషన్లలో 6.32 లక్షల నోట్లను పట్టుకోగా తర్వాత నాలుగేళ్లలో మూడు వంతులు ఎక్కువగా 18.87 లక్షల నోట్లను పట్టుకున్నారు. పట్టుకున్న వాటిలో రూ.100 నోట్లే ఎక్కువ. ఇప్పటికీ నకిలీ నోట్లు చలామణిలోనే ఉన్నాయి. దీన్ని బట్టి ఇందులో కూడ ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు.
క్యాష్‌లెస్ ఎకానమీ..
డీమానిటైజేషన్ మూడో ప్రధానోద్దేశం కరెన్సీ లావాదేవీలను తగ్గించడం. దీనిలో కొంత వరకు ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. డిజిటల్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో 81.52 కోట్లుగా ఉన్న డిజిటల్ లావాదేవీలు 2020 ఆర్థిక సంవత్సరానికి 1251.86 కోట్లకు పెరిగాయి. కాగా, దేశంలో కరెన్సీ సర్కులేషన్ 2016లో 16.4 లక్షల కోట్లు ఉండగా 2020 నాటికి 24.2 లక్షల కోట్లకు పెరిగింది.
డీమానిటైజేషన్‌తో పన్నుల ఆదాయం పెరిగిందని భారతదేశ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు కె వి సుబ్రమణియన్ తెలిపారు. ఏది ఏమైనా దీనివల్ల ప్రభుత్వ ఖర్చులు, సామాన్యులకు కలిగిన ఇబ్బందుల కంటే చేకూరిన ప్రయోజనం తక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.