సప్తపది సినిమా విడుదలై, జూన్ 26కి 40 ఏళ్లు అయ్యింది. సనానత సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఇటువైపు. ఊరి చివర మురికివాడలో ఉండే హరిజన కుటుంబం మరోవైపు. సమాజంలో బ్రాహ్మణుల వైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితులు.
అలాంటి రోజుల్లోనే ఓ హరిజన అబ్బాయిని, బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ కుటుంబ పెద్ద తన ఇంటమ్మాయిని హరిజనుడికిచ్చి పెళ్లిచేయడమనే విప్లవ ఆలోచనతో వచ్చింది సప్తపది సినిమా. కట్టుకున్న భార్యలో అమ్మవారిని చూస్తాడు గౌరీనాథ్ (రవికాంత్). ఆమెతో కాపురం చేయలేనంటాడు. అలా సంసార సుఖానికి నోచుకోని హేమ (సబిత), అదే ప్రాంతంలో ఉన్న హరిబాబు (గిరీష్ ప్రదాన్)ను ఇష్టపడుతుంది. గౌరీనాథ్ తాత యాజులు (జేవీ సోమయాజులు)కు ఈ విషయం తెలుస్తుంది. ఇంటి కోడలు సుఖాన్ని కోరుకున్న యాజులు, హరిబాబుకు ఇచ్చి హేమకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటాడు.
కానీ యాజులుది నిష్టతో కూడిన బ్రాహ్మణ కుటుంబం. హరిబాబుది హరిజన కులం. దీంతో ఆగిపోతాడు. మరోవైపు హేమ పరిస్థితి చూసి తట్టుకోలేకపోతాడు యాజులు. ఆ సమయంలో యాజులుకు ఆ ఊరి రాజుగారు అంటరానివాడిని ఆదరించిన శంకరభగవద్పాదుల మార్గంలో నడచుకోమని సలహా ఇస్తాడు. ఊరు అందరూ వ్యతిరేకించినా, వారికి ఆచార వ్యవహారాల్లోని అసలు విషయాలు విడమరచి చెబుతారు యాజులు. తన మనవడి భార్యను ఆమె కోరుకున్న హరికి ఇచ్చి సాగనంపుతాడు యాజులు. ఇదీ ‘సప్తపది’ చిత్రకథ.
ఇలాంటి కథలు ఇప్పుడు ఎన్నో. కానీ 40 ఏళ్ల కిందట ఇలాంటి కథ రావడం పెద్ద సాహసం. కేవలం కులాల ప్రస్తావన మాత్రమే కాదు, అప్పటికే పెళ్లయిన యువతికి మరో పెళ్లి చేయాలనే వినూత్నమైన ఆలోచన కూడా ఈ సప్తపదిలో ఉంది. అందుకే అప్పట్లో ఈ సినిమాను కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. కొన్ని ప్రాంతాల్లో సినిమాను ప్రసారం చేయకుండా అడ్డుకున్నారు కూడా. కానీ సమాజంలో అసమానతల్ని ఈ సినిమా ఎత్తిచూపింది. అందుకే జాతీ అవార్డు అందుకుంది.
యాజులుగా మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు సోమయాజులు. ఆయన నటన, హావభావాలు సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. ఇక సినిమాలో హేమగా నటించిన సబిత అయితే, ఆ తర్వాత సినిమాలు చేయలేదు. కె.విశ్వనాధ్ సూచనల మేరకు తనకిష్టమైన నాట్యకళను కొనసాగిస్తూ, ఉద్యోగం చేసుకుంది. ఇక ఈ సినిమాలో “గోవుళ్లు తెల్లన…” అనే పాటైతే ఇప్పటికీ అందరికీ ఇష్టమే. వేటూరి ఈ పాటకు కేవీ మహదేవన్ అద్భుతమైన బాణీ కట్టారు.
జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై భీమవరపు బుచ్చిబాబు ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో పెద్ద హిట్టయిన ఈ సినిమా, ఆ తర్వాత హిందీలో రీమేక్ అయింది. మిథున్ చక్రవర్తి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కూడా విశ్వనాథే దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక సప్తపదిలో కొసమెరుపు విషయానికొస్తే.. గోవుళ్లు తెల్లన పాటలో పిలకతో కనిపించిన బాలనటుడు మాస్టర్ రవి. అతడు మెరవరో కాదు, ప్రస్తుతం ఫేమస్ డబ్బింగ్ కళాకారుడిగా, క్యారెక్టర్ నటుడిగా కొనసాగుతున్న రవిశంకర్.











