అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన అనుచరులతో దాడి చేసిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. దాడి ఘటనపై తర్జనభర్జనలు పడ్డ పోలీసు ఉన్నత అధికారులు ఎట్టకేలకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో వైసీపీ నేతలు ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవ్ రెడ్డి, బాబా, రవిప్రసాద్ రెడ్డిలతోపాటు, కారును వేగంగా జేసీ ఇంటిపైకి దూకించిన డ్రైవర్ రమణను అరెస్టు చేశారు. దాడి చేసిన వారు వాడిన కారును పోలీసులు సీజ్ చేశారు.
అసలువాళ్లను వదిలేస్తారా..
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మందీ మార్బలం, ఆయుధాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి గేట్లు నెట్టుకుంటూ జొరబడిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయినా పోలీసులు మాత్రం కీలక నిందితులను వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి ఘటనలో ఐదుగురికి అరెస్ట్ చేశామని చెప్పుకోడానికి పనికివచ్చే విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలు దాడులు చేయడం, పోలీసులు అమాయకులపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందని టీడీపీ అధినేతలు విమర్శలు చేస్తున్నారు.