సంక్షేమ కార్యక్రమాల్లో అసలైన అర్హులు ఎంతవరకు ఉన్నారన్న విషయం పక్కన బెట్టి..ఇన్ని లక్షల మందికి లబ్ధి చేకూర్చామనే అంకెలు చూపించేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. అప్పులూ చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. తెలంగాణ, ఏపీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఉత్పాదక ఆదాయం తగ్గి ఆర్థికంగా వెనుకబడిన ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను పరస్పరం పోల్చిచూడడం.. ఈ పరిస్థితిని మరింత దిగజార్చేదిగా కనిపిస్తోంది.
నవరత్నాల పేరుతో నిధుల పంపిణీ
తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బల కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాల అమలుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలవుతున్న పథకాలను పరిశీలిస్తోందని, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్రాల్లోని పథకాలను కూడా పరిశీలిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది. రైతు బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పించన్లు, ఇలా పలు పథకాలు అమల్లో ఉన్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే నవరత్నాల పేరుతో నిధుల పంపిణీ జరుగుతోంది. ఇందుకోసం అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే రుణ సంక్షోభంలో రెండు రాష్ట్రాలు కూరుకపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పులపై పరిమితి ఉండేలా FRBM అమల్లో ఉన్నా.. ఏదో ఒక కారణం చూపి అప్పులు తెచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వనరులు పెరగకుండా, ఉత్పాదక రంగాలను విస్మరించి కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడం ఏపీకి రానున్న కాలంలో శాపంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పంథా కొనసాగితే రానున్న రెండు దశాబ్దాల పాటు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి తెలెత్తుతుందని నిపుణులు చెబున్నారు.
తెలంగాణ పరిస్థితి వేరు..
సంక్షేమ పథకాల్లో ఏపీ తెలంగాణలు పోటీ పడి అప్పులు చేస్తున్నా తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. హైదరాబాద్ తెలంగాణకు పెద్ద ఆర్థిక, పారిశ్రామిక వనరు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని రంగాల్లో కలిపి ఏటా దాదాపు రూ.6లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉండడం, స్థిరాస్తి భూమ్ కలసి రావడంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి వేరు. అంటే అప్పులు పెరిగినా సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం నుంచి కొన్ని చర్యల వల్ల బయటపడొచ్చు. కాని ఏపీలో ఆర్థిక వనరులు పెద్దగా లేవు. అనుత్పాదకత రంగంతో పాటు అసంఘిత రంగాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పెట్టుబడులను ఉత్పాదక రంగాల వైపు మళ్లించాల్సింది పోయి..సంక్షేమం వైపు మళ్లించడం మరో ఇబ్బందిగా మారింది.
ఏపీలో 50 శాతం అప్పులే..
తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో 50 శాతం పైచిలుకు అప్పులు తెస్తోంది. అప్పులు తీర్చేందుకు కొత్త పన్నులు విధించాల్సిన పరిస్థితిలోకి ఇప్పటికే వెళ్లింది ఏపీ. అప్పులు తెచ్చుకునేందుకు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకర్లు విధిస్తున్న షరతులకు అంగీకరిచాంల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయిదువేల కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం విధించే షరతులకు ఏపీ ఒప్పుకోగా తెలంగాణ మాత్రం ఆ షరతులను ఒప్పుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే..రానున్న కాలంలో థర్డ్ పార్టీ అంటే కేంద్రం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకుల కన్సార్టియాలు లేదా ప్రపంచ బ్యాంకు వంటివి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
అర్హులెందరు..
ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని ఎవరూ కాదననరు. అది అవసరం కూడా. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి అండగా ఉండేందుకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అవసరం. రైతులు, ఆడపిల్లల సంరక్షణ, వైద్య సేవలు, అక్షరాస్యత శాతం పెంచడం లాంటి ప్రాధాన్య అంశాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసి మిగతా వర్గాల్లోని వారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే చర్యలు అవసరం. అయితే, అలాంటివి కాకుండా నేరుగా పంపిణీ ఎంతమేరకు ఉపయోగం అనేదే అసలైన ప్రశ్నగా మిగిలింది. పైన పేర్కొన్న రంగాలు కాకుండా ఇతర వర్గాల్లో ఉన్న వారిలో 20శాతం మందికి మాత్రమే ప్రభుత్వ చేయూత అవసరమనే నివేదికలు గతంలో వచ్చాయి. కాని ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు 80 శాతానికి కవర్ స్కోప్ ఉందనే అంచనాలున్నాయి. అంటే అవసరం లేనివారికి కూడా కేవలం అధికారాన్ని నిలబెట్టుకునేందకు నిధులు ఇస్తున్నారని చెప్పవచ్చు. గతంలో చాలా ప్రభుత్వాలు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేశాయి. అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ముందుచూపు లేకుండా నియంత్రణ లేని వ్యయాలు, తప్పనిసరి పరిస్థితిలో చేసిన రుణాల కారణంగా వెనిజులా దేశ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకప్పుడు సంపన్నదేశంగా ఉన్న వెనిజులా..ఇప్పుడు అత్యంత పేద దేశాల సరసన చేరేందుకు సమీపంలోనే ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకోకపోవడం, ఉత్పాదక రంగాలను విస్మరించడం, ప్రజల్లో ఉపాధి సామర్థ్యాన్ని పెంచి జీవన ప్రమాణాల మెరుగును ప్రోత్సహించడానికి బదులు..ప్రభుత్వమే వారికి ఉచితంగా అన్నీ ఇవ్వడం లాంటి చర్యలు ఆ దేశాన్ని కోలుకోలేని సంక్షోంభంలోకి నెట్టాయి. చదివేందుకు ఇబ్బందిగా ఉన్నా.. కండోమ్‌ల ఖర్చు తట్టుకోలేక సెక్స్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి, పిల్లలు పుడితే వారి కనీస ఖర్చులు భరించలేమనే పరిస్థితి, సంబంధీకులు చనిపోతే వారిని చూసేందుకు ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి అక్కడ ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలూ వస్తున్నాయి.
అప్పుల తీరు ఇదీ..
తెలంగాణ రాష్ట్రం అప్పులు దాదాపు 3.5లక్షల కోట్లకు చేరగా ఆదాయ వనరులు పెద్దగా లేని ఏపీ కూడా ఇంచుమించు అదే బాటలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు బహిరంగ మార్కెట్ నుంచి ఏపీ రూ.31,250 కోట్ల రుణం తీసుకోగా తెలంగాణ రూ.22,961 కోట్లు సేకరించింది. 2018-19లో రూ.30,200 కోట్లు రుణం తీసుకున్న ఏపీ.. 2019-20లో తొలి ఏడునెలల్లోనే రూ.42,415 కోట్లు అప్పు చేసింది. తెలంగాణ 2018-19లో రూ.26,740 కోట్లు, 2018-19లో రూ.37,109 కోట్ల రుణం తీసుకుంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.3,53,596 కోట్ల రుణం తీసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 8.83%, తెలంగాణ వాటా 6.49% మేర ఉందంటే అప్పులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి కంటే ముందు మహారాష్ట్ర, తమిళనాడులు ఉన్నాయి. అప్పుల పరంగా ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, పూణె లాంటి నగరాలు మంచి ఆదాయ వనరులు. అక్కడి జనాభా, పరిశ్రమలు, ఉపాధి మార్గాలతో పోల్చితే ఏపీలో పరిస్థితి దారుణం. అయినా అప్పుల్లో పోటీ పడుతుండడమే ఆందోళనకరంగా కనిపిస్తోంది. నెలకు వడ్డీ రూపేణా రూ.700కోట్లు కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్పాదకత, సంపద సృష్టి లేకుండా.. కేవలం సంక్షేమ పథకాల అమలు..దీర్ఘకాలంలో ఏ కోణంలోనూ క్షేమం కాదనే విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు.. ఇప్పటికిప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకున్నా.. ఇప్పుడు చేసిన అప్పుల నుంచి బయటపడడం, కొత్తగా అప్పులు చేయకుండా ఉండే పరిస్థితి రావాలంటే కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందన్న అంచనా ఉందంటే… తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.