సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారం మూడు ముక్కలాట ధోరణిలోనే ఉంది. అనుకున్న ప్రాజెక్టు అనుకున్నట్లుగా సాగేలా కనిపించడం లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ చేయబోయే సినిమా మీద ఇంకా స్పష్టత రావడం లేదు. లెక్కప్రకారం వంశీ పైడిపల్లి సినిమా చేయాలి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. దానికి బదులు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ తెరపైకి వచ్చింది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి షెడ్యూలు కూడా షురూ చేసేశారు. ఇదిగో షూటింగ్ ప్రారంభించేస్తున్నారు అనేలా వార్తలు కూడా వచ్చేశాయి. తీరా ఇప్పుడు మరో వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మహేష్ బాబు ముందుగా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అనేది తాజా వార్త. ఓ పెద్ద హీరో సినిమా విషయంలో ఎందుకు ఇలాంటి గందరగోళం ఏర్పడుతోందంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కొంత కారణం. అసలు కరోనా అనేది లేకపోతే వంశీ పైడిపల్లి సినిమా ఈపాటికే ప్రారంభమై ఉండేది. కరోనా వచ్చాక మహేష్ తన ఆలోచన మార్చుకున్నారు. ‘సర్కారువారి పాట’ ముందు చేయడమే మంచిదనుకోవడం, దానికి ఏర్పాట్లు చేసేయడం జరిగిపోయింది. అమెరికాలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు అనుకున్నారంతా. కానీ అక్కడ షూటింగుకు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తినట్లు సమాచారం.
త్రివిక్రమ్ సినిమా సంగతేంటి?
మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు అనేది తాజా అప్ డేట్. అలాంటప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఎప్పుడు చేస్తారు, మిత్రుడు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారు అనే సందేహాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో ఇరుక్కుపోయారు. ఆ సినిమా పూర్తయితే తప్ప అందులో నుంచి బయటపడే మార్గం లేదు. అది ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదు. ఈ నవంబరు 1న త్రివిక్రమ్ పుట్టినరోజు. ఆయన సినిమా ఏది ప్రారంభం కాబోతోందో ఆరోజే అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్య పుట్టినరోజుకు అప్ డేట్ లు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. మరో పక్క పెద్ద హీరోలు షూటింగుల్లో ఎప్పటి నుంచి పాల్గొంటారనే దానిమీద స్పష్టత లేదు. ముందు పరశురామ్ సినిమా చేస్తారా, త్రివిక్రమ్ సినిమా చేస్తారా అన్నది తేలాలి. ఎన్టీఆర్ బయటకు వస్తే తప్ప త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం లేదు. పరశురామ్ సినిమా ‘సర్కారు వారి పాట’ మొదలైతే త్రివిక్రమ్ ఖాళీగా ఉండాలి. అందుకే త్రివిక్రమ్ కూడా తన సినిమా కోసం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మూడుముక్కలాటలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.











