కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం తమకు సమ్మతం కాదంటూ నినదిస్తున్న అన్నదాతలతో మోదీ సర్కారు శుక్రవారం నిర్వహించిన తొమ్మిదో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. సాగు చట్టాల రద్దుకు రైతులు, చట్టాల సవరణకు కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో మరో విడత పదోసారి చర్చలు జరిపేందుకు ఇరు వర్గాలు నిర్ణయించడం మినహా తొమ్మిదో విడత చర్చలు సాధించిందేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా జరిగిన ఎనిమిది విడతల చర్చలకు భిన్నంగా తొమ్మిదో విడత చర్చల్లో ఏమాత్రం పురోగతి కూడా కనిపించలేదు.
మోదీ సర్కారుకు ముచ్చెమటలు
దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న సాగు రంగంలో సమూల మార్పుల కోసం మోదీ సర్కారు కొత్తగా మూడు చట్టాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పార్లమెంటులో తమకు ఉన్న బలం నేపథ్యంలో సదరు ప్రతిపాదనలను చట్టంగా కూడా మార్చేసిన మోదీ సర్కారు.. సాగు రంగంలోకి కార్పొరేట్లకు పెద్ద పీట వేసేందుకు సిద్ధపడింది. కొత్త సాగు చట్టాల రూపకల్పన సందర్భంగా రైతుల నుంచి అంతగా వ్యతిరేకత రాకున్నా… ఆ ప్రతిపాదనలు చట్టాలుగా రూపాంతరం చెందిన మరుక్షణం అన్నదాతలు రోడ్డెక్కారు. సాగు రంగంలో కార్పొరేట్లకు పెద్ద పీట వేయడంతో పాటుగా ఆరుగాలం కష్టిస్తున్న తమకు తీరని అన్యాయం జరుతుందన్న వాదనలతో దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దులను చుట్టుముట్టారు. నెలన్నరకు పైగా అక్కడే తిష్ట వేసిన అన్నదాతలు మోదీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రైతుల ఆందోళనలు మొదలైన సమయంలో వాటిని పెద్దగా పట్టించుకోని మోదీ సర్కారు… అన్నదాతల నిరసనలకు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న మద్దతును చూసి దిగిరాక తప్పలేదు. రైతులు చేస్తున్న డిమాండ్ల మేరకు సాగు చట్టాలకు సవరణలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్న మోదీ సర్కారు… అన్నదాతలు డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు ససేమిరా అంటోంది. అదే సమయంలో కొత్త సాగు చట్టాలను రద్దు చేయడం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము ఒప్పుకునేది లేదని అన్నదాతలు తెగేసి చెబుతున్నారు.
19న మరోమారు చర్చలు
ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిది విడతలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. శుక్రవారం జరిగిన తొమ్మిదో విడత చర్చలు కూడా నిష్ఫలంగానే మిగిలిపోయాయి. కొత్త సాగు చట్టాల రద్దుకే రైతులు పట్టుబట్టగా, వాటిలో సవరణకు మాత్రమే తాము సిద్ధమంటూ కేంద్రం.. ఇలా ఎవరి వాదనలకు వారు కట్టుబడిపోయారు. ఫలితంగా తొమ్మిదో విడత చర్చలు కూడా నిష్ఫలమయే అయ్యాయి. అయితే ఈ నెల 19న మరోమారు చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. పదో విడత చర్చల్లోనూ ఆశించిన మేర ఫలితం వచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొమ్మిదో విడత చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్రం తరఫున చర్చల్లో పాలుపంచుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ సాగు చట్టాల్లో రైతుల డిమాండ్లను చేర్చేందుకు, ఆయా డిమాండ్లకు అనుగుణంగా సాగు చట్టాలను సవరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. అదే సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగానే ఉన్నామని కూడా అన్నదాతలు స్పష్టం చేశారు.
సుప్రీం కమిటీకి ఆదిలోనే షాక్
ఇదిలా ఉంటే… రైతులు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీకి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. కమిటీలో కీలక వ్యక్తిగా భావిస్తున్నభారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మాన్.. కమిటీ నుంచి తనకు తానుగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. కమిటీలో తనను సభ్యుడిగా నియమించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన మాన్… రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి పదవినైనా వదులుకునేందుకు తాను సిద్ధమని కూడా ప్రకటించారు. ఈ నెల 19న ఈ కమిటీ తొలి భేటీ జరగనుంది. ఈ భేటీలో ఈ ప్రతిష్టంభనకు చెక్ పెట్టేలా ఏదో ఒక ప్రణాళిక రచిస్తారన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో… కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా మాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఈ కమిటీలోని మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా గతంలో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడినవారేనంటూ రైతులు చేసిన ఆరోపణలు కూడా కమిటీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.