రాష్ట్ర పరిస్థితులపై ప్రగతి భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వల్ల జరిగిన నష్టం, వరద వల్ల ప్రభుత్వానికి వెంటాడుతున్న కష్టాలు, ఇతర అభివృద్ది పనులపై కూడా సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా మారాయి. వాటి నుంచి ఎలా గట్టెక్కాలి. అలాగే హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ముంచెత్తిన వరదల వల్ల జరిగిన నష్టం, బాధితులకు అందుతున్న వరద సాయంపై ప్రధానంగా సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వరదల అనంతరం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి జరిగిన నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందవలసిన సాయం, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు తదితర అంశాల వారీగా ఈ సమీక్షలో చర్చకు రానున్నాయని తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్‌కు వరదలు ఎంతలా ముంచెత్తినాయో తెలిసిందే. దీంతో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెల్లుబీకింది. దీనిని గమనించిన అధికారపార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని రూ.550 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. అయితే ఆర్థిక సహాయం అందజేత విషయంలో ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు ఇవ్వకుండా అనర్హులకు, తమ సొంత పార్టీ కార్యకర్తలకు రూ.10వేల సాయాన్ని ఇస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. అలాగే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు.. సాయాన్ని పంచకుండా వారే పెద్ద మొత్తంలో దండుకున్నారనే ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. దీంతో డిఫెన్స్‌లో పడ్డ ప్రభుత్వం ఒకటి రెండు రోజులు ఆర్థిక సాయం అందజేత కార్యక్రమాన్ని నిలిపివేసి మళ్లీ తిరిగి ప్రారంభించింది. ఇది ప్రభుత్వానికి మైనస్‌గా మారింది. అయితే సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిపే సమీక్ష సమావేశంలో ఈ వరద సాయం అంశంపై కూడా చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ప్రజలకు ఆర్థిక సహాయం సరిగ్గా అందిందా లేదా? అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష కూడా జరపనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుపుతారు. దీంతోపాటు యాదాద్రి దేవాలయ పనులపై సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జరిగే సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, అర్థిక శాఖ అధికారులు, వైద్యాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రేపు మంత్రులతో కూడా సీఎం సమీక్ష సమావేశం జరపనున్నట్లు తెలిసింది.