ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నా కనిపించకుండా పోయిన సజ్జల సడెన్ గా ప్రత్యక్షం అయ్యారు. జగన్ తన ఇష్టారీతిన టికెట్ల విషయంలో చేస్తున్న ప్రక్షాళనపై స్పందించారు. ఆయన మాటలను బట్టి ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు.. అధిష్ఠానం తాను అనుకున్నట్లు చేసితీరుతుందనేలా మాట్లాడారు. అభ్యర్థులు, కీలక నేతల మాట వినకుండా.. అధిష్ఠానం నియోజకవర్గ ఇంఛార్జిల మార్పులను కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తన సీటును ఎవరు తన్నుకుపోతారో, జగన్ ఎవరికి కట్టబెడతారో అనే ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారంతా ముఖ్యమంత్రి కార్యాలయానికి బుధవారం క్యూ కట్టారు.
పార్టీలో కీలక నేతలు, రీజినల్ కో ఆర్డినేటర్స్ అయిన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలను కూడా కలిసి తమ సీటు తమకే ఉంచాలని వారితో లాబీయింగ్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు సీఎంవోలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ ధనుంజయ రెడ్డిలతో సమావేశం అయ్యారు. వాళ్ల పర్ఫామెన్స్, గ్రాఫ్, సర్వే రిపోర్టులు ఎలా ఉన్నాయనే వివరాలను ఎమ్మెల్యేలకు ధనుంజయ రెడ్డి అందించినట్లు సమాచారం. ఇంకొందరు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ను కలిసే అవకాశమూ దక్కింది. ఇలా తమ స్థానం పదిలపర్చుకోవడానికి దొరికిన వారిని దొరికినట్లుగా ఎమ్మెల్యేలు కలిశారు.. లాబియింగ్ లు చేసుకున్నారు. ఈ భేటీలన్నీ అయిన తర్వాత సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ విధానాలు నచ్చనివారు వెళ్లిపోతారని, అలాంటివారి గురించి తాము అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని పదునుగా మాట్లాడేశారు.
వైసీపీ బలంగా ఉందని.. అందుకే టికెట్ల కోసం ఎమ్మెల్యేలు అంతగా క్యూ కడుతున్నారని చెప్పారు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తామని.. లేదంటే వారు వెళ్లిపోవచ్చని అన్నారు. వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అతి విశ్వాసంతో మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పుచేర్పులు పూర్తిచేసి త్వరలో లిస్టును ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ బుధవారం రాత్రి సమావేశం అయ్యారు. కోఆర్డినేటర్లు మార్పుల ప్రయత్నాలపై చర్చించారు. మార్పులు జరిగే స్థానాల్లో కొత్త వారికి, పాత వారికి సఖ్యత కుదరడం కష్టమని వారు అభిప్రాయపడ్డారు.
రీజినల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను కలవడానికి, వీలుంటే సీఎంను దర్శనం చేసుకోవడానికి, లాబీయింగ్ చేసుకోవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు బుధవారం సీఎంవోకు వచ్చారు. వారిలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి ఉష శ్రీచరణ్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, అదీప్‌రాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కరణం ధర్మశ్రీ, చెన్నకేశవరెడ్డి, తిప్పేస్వామి, కాపు రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, సిద్దారెడ్డి, గొల్ల బాబూరావు, కొఠారు అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన రెడ్డి, కంబాల జోగులు తదితరులు ఉన్నారు.











