హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వేగంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగానూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పంపిన బ్యాలెట్ బాక్సులను తిరిగి వెనుకకు తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటికోసం తెలంగాణ నుండి దాదాపు 30 వేల బ్యాలెట్ బాక్సులను అప్పట్లో ఏపీకి పంపారు. అయితే కోవిడ్, ఇతర కారణాలవల్ల ఏపీలో ఎన్నికలు వాయిదాపడడంతో ఆ బాక్సులను వెనక్కు తెప్పించి త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు తీసుకొస్తున్నారు.
బ్యాలెట్‌కే సై అన్న పార్టీలు..
జిహెచ్ఎంసి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్ పార్థసారధి కూడా తిరుపతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల పోలీంగ్ విధానం, నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయపార్టీల అభిప్రాయాన్ని గతంలో కోరింది. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలా? లేదా ఈవిఎం ల ద్వారా జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలా? అనే అభిప్రాయాన్ని కమిషన్ కోరింది. దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈక్రమంలోనే ఎన్నికల కమిషన్.. బ్యాలెట్ బాక్సుల ద్వారా జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. దీంతో గతంలో ఏపీకి పంపించిన బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ చేపట్టనుంది.
12వేల పోలింగ్ బూత్‌లు..
కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి జిహెచ్ఎంసి ఎన్నిలకు పోలీంగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 12వేల వరకు పోలీంగ్ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన 30 వేల బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు తీసుకొస్తున్నారు. గురువారం వరకు ఏపీ నుంచి 17,366 బాక్సులు తెలంగాణకు అందాయి. మిగిలిన 12366 బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.తూర్పుగోదారి నుండి 449, విశాఖపట్నం నుండి 7111, అనంతపురం నుండి 357, నెల్లూరు నుండి1300, ప్రకాశం నుండి 841, కడప నుండి 1850, చిత్తూరు నుండి 5458 బ్యాలెట్ బాక్సులు వచ్చినట్లు తెలిసింది. తీసుకొచ్చిన బాక్సులను చాధర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్, సికింద్రాబాద్ హరిహరాకళా భవన్లో భద్రపరచనున్నట్లు తెలిసింది. అధికారులు బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేస్తుండటంతో ఇక గ్రేటర్లో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లే.











