ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ అంశం గురించి ఆయన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల వలన దేశవ్యాప్తంగా రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. అలాగే రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కెసిఆర్ కు కోరారు. ఆ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఆయన లేఖలో తెలిపారు.
ఇప్పటికే ఈ బిల్లులపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయని కోమటి రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించి ప్రజలను ఆదుకోవాలని ఆయన సిఎంకు లేఖలో కోరారు.
అది సాధ్యమేనా?..
తాజాగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మూడు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని నొక్కి మరీ చెప్పాయి. అయినా కానీ కేంద్రం ఆ మూడు బిల్లులను లోక్‌సభలో, రాజ్యసభలో ఆమెదం పొందించి చట్టాలుగా రూపకల్పన చేసింది. అయితే ఈ వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వ్యతిరేకించడమే కాదు ఏకంగా తమ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తోంది. రాష్ట్రాల్లో ఆ చట్టాలు అములు కాకుండా ఉండేందుకు ప్రత్యేక ముసాయిదాను కాంగ్రెస్ అధిష్టానం రూపకల్పన చేస్తోంది.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో లేని పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఎంత వరకు చేస్తాయో చెప్పడం కష్టమే. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ అలా చేస్తుందా? అనే సందేహం కలగకమానదు. బిజెపి పార్టీతో టిఆర్ఎస్ పార్టీ వైఖరీ రాష్ట్రంలో ఎలాగున్నా జాతీయ నాయకత్వంతో మాత్రం అటుఇటుగానే ఉంది. పూర్తిగా స్నేహపూర్వకంగా కాదు.. అలాగని అంతకన్న విరోధం కూడా లేదు. న్యూట్రల్‌గానే ఉంటూ వస్తోంది. అవసరమున్నప్పుడు రెండు మాటలు అంటూనే అవకాశం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్ధిస్తూ వస్తోంది. అలాంటిది వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తెరాస ప్రభుత్వం తీర్మానం చేసే వీలుందా?
ఈ సమావేశాల్లో చూడాలి మరి..
మరీ ఇలాంటి పరిస్థితుల నడుమ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవసాయ బిల్లుపై అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయడం కాస్త ఆలోచించదగ్గ అంశమే. అలాగాని తీర్మానం చేసే ధైర్యం, తెగువా లేదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే. సిఎం కెసిఆర్ తలుచుకుంటే అది చిటికెలో పనే. ఆయన అనుకోవాలే గానీ వెనువెంటనే చేసేస్తారు. అసలే ఆయన కుండబద్దలు కొట్టి మాట్లాడే రకం. 13, 14 తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జిహెచ్ఎంసి చట్టాల సవరణ, హైకోర్టు సూచించిన పలు అంశాలపైన చర్చ జరగనుంది. కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నట్లు ఈ సమావేశాల్లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేస్తుందో లేదో చూడాలి మరి.











