గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు చేరవయ్యేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బస్తీల్లో ప్రజా సమస్యలు పై దృష్టి సారించింది. ఇప్పటికే రోడ్ల మరమ్మత్తుల పనులు ఉదృతం చేసింది. ఇక కాలనీల్లో పేరుకు పోయిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇకపై ప్రజలకు చేరువగా ఉంటూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కార్పోరేటర్ లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న వారు.. పనిలో పనిగా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రకృతి కోపం తట్టుకోలేక…
అయితే కార్పోరేటర్ లు క్షేత్ర స్థాయిలో యాక్టీవ్ అయ్యారో లేదో.. ప్రకృతి వారికి విరుద్దంగా వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భారీ వర్షాల తో నగరంలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా రోడ్లపై నీరే దర్శనమిస్తోంది. కాలనీలు, ఇళ్లు ఇలా ఏది చూసినా నీటితో నిండి పోయి కనిపిస్తున్నాయి. . దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల, గ్రేటర్ కార్పొరేషన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌లో సమస్యలు లేకుండా చేస్తామని.. వరద నీరు ఇళ్లలోకి రాకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఏమీ లేదంటూ చెబుతున్నారు ప్రజలు. ప్రజల్లో ఉన్న అక్రోశం ఏకంగా కేటీఆర్ పైనే చూపించారు నగర వాసులు. వరదల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళారు కేటీఆర్. ఎల్బీనగర్ వద్ద వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళడంతో స్థానికులు ఒక్కసారిగా కేటీఆర్ వద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేసారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. స్థానికులు కేటీఆర్, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
విపక్షాలు కత్తి దూస్తున్నాయి..
ఐదేళ్ళ నుండి గత పాలకులపై పాపం నెట్టి పబ్బం గడుపుకున్నాయని విమర్శిస్తున్నాయి విపక్షాలు. దీంతో ఈ ఎన్నికల్లో ఇదే ప్రధానాస్త్రంగా వెళ్ళేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజా సమస్యలు గాలికొదిలేసి డల్లాస్ పేరుతో నగర ప్రజలను వంచన చేసారని విమర్శిస్తున్నారు. ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో. నగరంలో భారీగా వరద నీరు వచ్చి చేరడం టీఆర్ఎస్ కు శాపంగా మారింది. ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు పార్టీ గెలుపుపై కచ్చితంగా ప్రభావం చూపుతాయంటున్నారు రాజకీయ నిపుణులు. గ్రేటర్ లో మారు మారు టీఆర్ఎస్ పాగా వేయడం ఖాయం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ అధినేతలు ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.











