గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొద్ది కాలానికి ఆయన ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద సంచలనమే అయింది. కోడెల తనయుడు శివరాం ప్రవర్తన కారణంగా సత్తెనపల్లిలో అనేక మంది నాయకులు టీడీపీకి దూరమయ్యారని అందరికీ తెలిసిందే. కోడెల శివరాంకు సత్తెనపల్లి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే టీడీపీలో పనిచేయలేమని కొంత మంది నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ మనసులో మాట చెప్పారు. అయితే, కోడెల శివప్రసాద్ మరణం తరవాత శివరాం బాగా యాక్టివ్ అయ్యారు. టీడీపీ అధిష్ఠానం ఏ పిలుపు ఇచ్చినా వెంటనే అనేక గ్రామాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇప్పటికే కోడెల శివరాం అన్నీ గ్రామాల్లో టీడీపీ నాయకులను కలసి గతంలో జరిగిన ఘటనలు మరచిపోవాలని, ఇక ముందు అలాంటి తప్పులు జరగవని హామీ ఇస్తున్నారు. దీంతో కొంత మంది మెత్తపడి మరల కోడెల గ్రూపులో చేరిపోయారు. దీంతో సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలు కోడెల శివరాంకు అప్పగిస్తారని బాగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి ప్రచారం ప్రారంభమై సంవత్సరం అవుతున్నా టీడీపీ అధినేత మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగాయి.
సత్తెనపల్లిలో పాగాకు మల్లిఖార్జునరావు యత్నం
సత్తెనపల్లిలో కోడెల శివరాంను వ్యతిరేకిస్తున్న వారందరినీ ఓ గ్రూపుగా తయారు చేసి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మల్లిఖార్జునరావు ఇన్‌ఛార్జిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో కోరుతున్నారు. కోడెల శివరాంతో పని చేయలేమని, అతనికి తప్ప మరెవరికి ఇచ్చినా పార్టీ బలోపేతానికి పని చేస్తామంటూ గ్రామ స్థాయి నాయకులతో చెప్పిస్తున్నారని తెలుస్తోంది. అంటే కోడెల శివరాంను నరసరావుపేట నియోజకవర్గానికి పంపిస్తే, సత్తెనపల్లిలో పాగా వేయాలని తెలుగు యువత నాయకుడు మల్లిఖార్జునరావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఓ వర్గం కోడెల శివరాంతో కలసి పనిచేసేందుకు ముందుకు రావడం లేదనేని సత్యం. అలాంటి వారి అండతో సత్తెనపల్లిలో టీడీపీని గట్టెక్కించడం కష్టమని అధిష్ఠానం జరిపించిన అంతర్గత సర్వేలో తేలిందట. అందుకే సరైన అభ్యర్థి కోసం టీడీపీ అధినేత వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
మూడో కృష్ణుడు వచ్చాడు
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు టీడీపీలో ఎప్పటి నుంచో కీలకంగా పనిచేస్తున్నారు. అయితే, రంగారావు ఇంత వరకు ఎక్కడా పోటీ చేసిన చరిత్ర లేదు. వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు పని చేసింది. రాష్ట్ర విభజన తరవాత 2014లో టీడీపీలో చేరారు. రాయపాటి సాంబశివరావు నరసరావుపేటలో 2014లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో అక్కడే పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాయపాటి సాంబశివరావు ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రాయపాటి వారసుడిగా రంగారావుకు ఓ దారి చూపాలని ఆయన భావిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం అయితే ఇందుకు అనువుగా ఉంటుందని రాయపాటి భావిస్తున్నారు. 2019లో కూడా సత్తెనపల్లి టీడీపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ కోడెల కుంటుంబాన్ని కాదని రాయపాటి రంగారావుకు సీటు ఇవ్వలేకపోయారు. ఎప్పటికైనా సత్తెనపల్లిలో పోటీ చేయాలని రంగారావు చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికీ అప్పుడప్పుడు సత్తెనపల్లి టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఓ గ్రూపును తయారు చేసుకున్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీలో ఎవరి దారి వారిదే అన్న చందంగా తయారైంది.
ఏ నిర్ణయం తీసుకోని అధినేత
రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలకు టీడీపీ బాధ్యులను నియమించినా సత్తెనపల్లికి మాత్రం ఇన్‌ఛార్జిని నియమించలేదు. ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుంటుంబంపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతోంది. దీంతో కోడెల శివరాం కూడా చురుగ్గా తిరుగుతున్నారు. ప్రత్యర్థి అంబటి రాంబాబును ఎదుర్కోవాలంటే కోడెల కుటుంబంతోనే సాధ్యమని టీడీపీ అధినేత భావిస్తున్నారట. కొంచెం ఆలస్యంగానైనా కోడెల శివరాంను సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- పదవుల భర్తీ : స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ