ఈ సీజన్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ టీమ్ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. పాయింట్ల పట్టికల్లో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన పంజాబ్ టీమ్ ఒకే ఒక్క విజయం సాధించింది. అయితే ఆ ఒక్క విజయమే పంజాబ్‌లో స్ఫూర్తి నింపుతోంది. ఎందుకంటే ఆ విజయం బెంగళూరుపై లభించింది. గురువారం జరుగబోయే మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌తోనే పంజాబ్ తలపడుతోంది.
బెంగళూరు ఈ సీజన్‌లో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి ఐదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన పంజాబ్‌పై పగ తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ గురువారం మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. అనారోగ్యం నుంచి కోలుకుని ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 7:30 గంటలకు షార్జా మైదానంలో జరిగే మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బెంగళూరు టీమ్ (బలాలు)
బెంగళూరు బ్యాట్స్‌మెన్ అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దేవదత్, ఆరోన్, కోహ్లీ, డివిల్లియర్స్ బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్నారు. గత టోర్నీల్లో ఎన్నడూ లేని రీతిలో కోహ్లీ సేనలో ఉత్సాహం ఉరకలేస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే కోహ్లీ సేన ఓటమి చవి చూసింది. క్రిష్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ రూపంలో నాణ్యమైన ఆల్ రౌండర్లు కీలక ఆటగాళ్లుగా మారారు. బౌలింగ్ విభాగం కూడా ఫర్వాలేదనిపిస్తోంది.
బలహీనతలు
వరుస విజయాలు సాధిస్తుండడంతో కోహ్లీ సేనలో బలహీనతలు పెద్దగా బయటపడడం లేదు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి చవి చూసింది. ఈ టోర్నీలో పంజాబ్ గెలిచిన ఒక్క మ్యాచ్ బెంగళూరు మీదే కావడం గమనార్హం. ఆ సెంటిమెంట్ ఒకటే బెంగళూరును భయపెడుతోంది. ఇక, బ్యాటింగ్ స్థాయిలో బౌలింగ్ విభాగం సత్తా చాటలేకపోతోంది.
బెంగళూరు టీమ్ (అంచనా) దేవదత్ పడిక్కళ్, ఆరోన్ ఫించ్, కోహ్లీ, డివిల్లియర్స్, శివం దూబే, మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఉడాన, నవదీప్ షైనీ, సిరాజ్, చాహల్.
పంజాబ్ టీమ్ (బలాలు)
వరుస పరాజయాలతో డీలా పడిన పంజాబ్ టీమ్‌కు క్రిస్ గేల్ రాక ఊరట కలిగిస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న గేల్ రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండబోతున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా ప్రకటించాడు. గేల్ గనుక వీర విధ్వంసం చేస్తే ప్రత్యర్థి టీమ్ ఏదైనా తల వంచాల్సిందే. ఇక కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జోర్డాన్, షమీ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పంజాబ్ టీమ్‌లో ఉన్నారు. వారు ఇకనైనా ఫామ్‌లోకి వస్తే పంజాబ్ కాస్త మెరుగైన స్థితిలో నిలుస్తుంది. ఇప్పటికే ఒకసారి బెంగళూరును ఓడించడం పంజాబ్‌కు కాస్త ఊరట కలిగించే అంశం.
బలహీనతలు
వరుస పరాజయాలు పంజాబ్ టీమ్‌ను నిరాశలో ముంచేశాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. టీమ్‌లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నా వారెవరూ సత్తా చాటలేకపోతున్నారు. ఇక, ప్రధాన బౌలర్లందరూ నిరాశపరుస్తున్నారు. ఓవర్‌కు పదికి పైగానే పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైతే ఈ సీజన్‌లో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్టే.
పంజాబ్ టీమ్ (అంచనా) కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రన్ సింగ్, రవి భిష్ణోయ్, దీపక్ హుడా, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ షమీ, కాట్రెల్.
మ్యాచ్ ఫేవరెట్ కచ్చితంగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్‌నే ఫేవరెట్‌గా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. ఇక, ఇప్పటికే ఒకసారి బెంగళూరును ఓడించిన పంజాబ్ మళ్లీ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనుకుంటోంది. మరి, ఎవరి ఆశలు ఫలిస్తాయో చూడాలి.











