రోజారమణి, చక్రపాణి దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. వర్చువల్ పద్ధతిలో అవార్డు ప్రధానం జరిగింది. శనివారం సాయంత్రం రోజారమణి, చక్రపాణిల నివాసంలోనే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వారి కుమారుడు హీరో తరుణ్, తనయ అమూల్య తమ తల్లిదండ్రులకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి పురస్కారంతో సత్కరించారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ తన తల్లి ‘భక్త ప్రహ్లాద’లో నటించి చిన్నపుడే జాతీయ పురస్కారం అందుకోవడం గొప్పవిషయమన్నారు. తను కూడా ‘అంజలి’లో బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం కాకతాళీయంగా జరిగిందని గుర్తుచేసుకున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు శవంశీ రామరాజు స్వాగతం పలికిన ఈ సభలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సమాఖ్య ట్రస్టీ వీపీ కిల్లి అవార్డు గ్రహీతల గురించి వివరించారు.
మురళీమోహన్ మాట్లాడుతూ రోజారమణితో తను వస్తాడే మా బావ, భారతంలో ఒక అమ్మాయి చిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. ఆమె మంచి నటి అని ప్రశంసించారు. ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా మొట్టమొదట తానే పరిచయం చేశానని తెలిపారు. 400 చిత్రాలకు పైగా సుహాసిని, రాధా, మీనా, విజయశాంతి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారన్నారు. ఆమె భర్త చక్రపాణి ఒరియాలో మనకు ఎన్‌టీఆర్ లాగా పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలందుకున్నారన్నారు.
రోజారమణి మాట్లాడుతూ తమ జీవితమంతా కళలకు అంకితమైందని అన్నారు. సంగీత కార్యక్రమంలో రాధిక నోరి(అమెరికా), రాజేంద్రప్రసాద్(వైజాగ్) పాటలు పాడారు. సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, ప్రసాద్ తోటకూర, జయశ్రీ పీసపాటి (హాంగ్ కాంగ్), విజయ గొల్లపూడి (ఆస్ట్రేలియా) ప్రసంగించారు. డా. తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.











