మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారనే సంగతి తెలిసిందే. అది ఓ త్రీడీ సినిమా. చిన్న పిల్లల చిత్రమిది. దీని పేరు ‘బార్రోజ్’. త్రీడీ ఫాంటసీలో ఈ సినిమా రూపొందుతోంది. ఎక్కువగా బ్లూ మ్యాట్ మీదే షూటింగ్ ఉంటుంది. టైటిల్ పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నారు. దీని నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే చూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ఈరోజు విడుదలైంది. సంతోష్ శివన్ దీనికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇందులో స్పానిష్ తారలు పాజ్ వెగా, రాఫెల్ అమర్గోలో లాంటి ఇంటర్నేషనల్ నటులు కూడా నటిస్తున్నారు. రాఫెల్ అమర్గోలో సిల్వెస్టర్ స్టాలోన్ తో నటించి అవార్డులు కూడా సాధించారు. దీనికి 13 ఏళ్ల లిడియన్ నాదస్వరం అందించడం మరో విశేషం. ఇది చిన్న పిల్లల ఫాంటసీ చిత్రమని మోహన్ లాల్ చెబుతున్నారు. పోర్చుగల్, స్పెయిన్, ఆఫ్రికా, ఇండియా సముద్ర చరిత్ర నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. దీని షూటింగ్ గోవాలో జరుగుతుంది. తను కెమెరా ముందు నుంచి వెనక్కి వెళ్లే రోజు వచ్చిందని మోహన్ లాల్ పేర్కొన్నారు.
త్రీడీ సినిమాల్లో మొట్టమొదటిది ‘కుట్టి చేతన్’. ఇది చిన్నారి చేతన పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఆ సినిమా దర్శకుడు జిజోతో చర్చించాకే బారోజ్ ప్రారంభించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది వాస్కోడిగామా నేపథ్యంతో ఉంటుంది. వాస్కోడి గామా సంపాదనను ఓ వ్యక్తి దగ్గర దాస్తాడు. ఆ వ్యక్తి గురించి జిజో మోహన్ లాల్ తో చెప్పారట. తను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేనని, మోహన్ లాల్ నే చేయమని జిజో అన్నాడట. అలా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. చిన్నపిల్లల సినిమా కాబట్టి వారికి కావాలసిన అన్ని అంశాలనూ ఇందులో జోడించడానికి మోహన్ లాల్ గట్టిగానే కృషిచేస్తున్నారు.











