వరదలు- గ్రేటర్ హైదరాబాద్ పేదల బతుకులను మరింత దుర్భరం చేశాయి. కరోనా మహమ్మారితో ఈ ఏడాది మొదటి నుంచి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు వరదలు మరింత కష్టాన్ని, నష్టాన్ని కలిగించాయి. ఉన్న ఊర్లో పనులు లేక పొట్ట చేత పట్టుకుని బాగ్యనగరానికి చేరుకున్న పేదలకు బతుకులు బరువయ్యాయి.
ఎన్నోఏళ్లుగా పట్నంలో ఉంటూ కూలీనాలి చేసి కూడ బెట్టిన డబ్బులతో కట్టుకున్న చిన్న ఇల్లు కూడ చెరువై నేడు పేదలు లబోదిబో మంటున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదోళ్ళకు నేడు కనీసం తలదాచుకునేందుకు గూడు కూడా లేకుండా పోయింది. పొట్టచేత పట్టుకుని నగరానికి వచ్చి పస్తులుంటూ కూడబెట్టిన డబ్బుతో తక్కువ ధరకు వస్తోందని చిన్న స్థలం కొని కట్టుకున్న ఇళ్లు కూడ చెరువులవడంతో నేడు వారి పరిస్టితి దయనీయంగా మారింది.. రియల్ గద్దలు చేసిన మోసానికి నేడు వీరు బలయ్యారు. చెరువులు , నాలాలు కబ్జాచేసి పేదలకు అంటగట్డడంతో నేడు వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుండి కరోనా మహమ్మారి పేదల జీవితాలను దుర్భరం చేసింది. పనులు దొరక్క, , తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు మరవక ముందే మరో గండం వారిని వెంటాడింది. తుఫాను కారణంగా హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు కాలనీలు చెరువులయ్యాయి. అర్ధరాత్రి ముంచెత్తిన వరద తో చాలా మంది ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఆ తర్వాత కూడ నగరంలో వర్షాలు కురుస్తుండటంతో వారం రోజులుగా చాలా మంది ఇళ్లు నీళ్లలోనే ఉన్నాయి.
దీంతో అష్టకష్టాలు పడి కట్టుకున్న ఇళ్లు , సామాన్లు వరద పాలవ్వడంతో బరువెక్కిన గుండెలతో వారు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అక్కడ నుండి తరలి వెళ్లాలని, లేదంటే ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు మైకుల్లో ప్రచారం చేయిస్తున్నారు.
సర్కారు మాటలతో జనంలో వేదన
దీంతో నీట మునిగిన కాలనీలవాసులే గాక చాలా కాలానీల ప్రజలు ముందస్తుగా తమ వస్తువులతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రెండు మూడు రోజుల పాటు ఎవరిని వారే కాపాడుకోవాలంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు వారికి మరింత వేదన కలిగిస్తున్నాయి. కాపాడుతామన్న కనీస భరోసా కూడా ఇవ్వకుండా ఇలా కట్టుబట్‌లతో అయినా సరే ప్రాణాలు కాపడుకోమని చెబుతుండటంపై విమర్శలొస్తున్నాయి. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తరుణంలో వరదలు మరోసారి తమను వీధిన పడేశాయని పేదలు ఆవేదన చెందుతున్నారు. పనుల్లేక పస్తులతో కాలం వెళ్ళదీస్తున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉండాలి… వరదల కారణంగా నష్టపోయిన వారికి వందశాతం నష్టపరిహారం చెల్లించి వారికి అండగా ఉండి పేదల బతుకులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.











