(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టి పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనాయకుడు కింజరాపు అచ్చెంనాయుడు కళ్లెం వేసేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఏకఛత్రాధిపత్యంగా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి తాజాగా రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన నేత అచ్చెన్నాయుడు. చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నతో పూర్వ వైభవం వచ్చేనా..? అనేది ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు తీవ్ర చర్చనీయాంశంగా ఉంది.
టీడీపీకి నమ్మిన బంటు
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు ఆ పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల అత్యంత విశ్వాసం కలిగివుండటంతో పాటు పార్టీ ప్రగతికి ఎటువంటి తెగువనైనా ప్రదర్శించేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. పార్టీ అధినేత చంద్రబాబుపై ‘ఈగ వాలితే తనపై దుడ్డు పడినట్టు’ భావించే స్వభావిగా మన్ననలు పొందారు. అందుకే కష్టకాలంలో పార్టీని ఆదుకుని, పూర్వ వైభవం తెచ్చిపెట్టగలిగే సమర్థుడు అనే నమ్మకం అచ్చెన్నపై ఉండటంతోనే అనేక తర్జనభర్జనల అనంతరం పార్టీ పగ్గాలను అధినేత ఈయనకు అప్పజెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మడమ తిప్పని నాయకుడు
తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ఆరంగేట్రం చేసిన అచ్చెన్న ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ పార్టీలోనే కొనసాగుతూ మడమ తిప్పని నాయకునిగా పార్టీ శ్రేణుల్లో మంచి గుర్తింపు పొందారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులతో 1996లో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని అప్పటి హరిశ్చంద్రపురం అసెంబ్లీ నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అడుగుపెట్టారు.
అంతవరకు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రంనాయుడు ఎంపీగా గెలుపొందారు. అందువల్ల జరిగిన ఉప ఎన్నికతో అచ్చెన్నాయుడుకు రాజకీయ ఆరంగేట్రంకు అవకాశం కలిగింది. అనంతరం 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుండి మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. 2004లో జరిగిన అసెంబ్లీల పునర్విభజనలో హరిశ్చంద్రపురం కనుమరుగైంది. దాంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన అచ్చెన్న తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కొర్ల రేవతీపతిపై ఓటమి పాలయ్యారు. రేవతిపతి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకమునుపే ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆ సందర్భంగా నిర్వహించిన ఉప ఎన్నికల్లో రేవతిపతి భార్య కొర్ల భారతి కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కలి అసెంబ్లీ బరిలో దిగగా , ఆమెకు ప్రత్యర్థి గా మరోమారు టీడీపీ తరపున పోటీచేసిన అచ్చెన్న మళ్లీ ఓటమి పాలయ్యారు.
అయినా చెక్కుచెదరని ధైర్యంతో అచ్చెన్న తన ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ , ప్రజలతో మమేకమవుతూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండే విజయదుందుభి మోగించారు. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోమారు అదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా, అనంతరం కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా కొనసాగినప్పటికీ వైసీపీ అభ్యర్థిపై టెక్కలి నుండి గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనాయకునిగా తన సత్తా చాటారు. వైసీపీ దూకుడుకు అసెంబ్లీలో అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజాప్రయోజనమైన అనేక అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో ముందువరుసలో నిలుస్తున్నారు.
‘కళా’కు అచ్చెన్నకు పోలికే లేదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకట్రావుకు , అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు ఏ మాత్రం పోలిక లేదు. కళా వెంకట్రావు సౌమ్యుడు, మృదుస్వభావి. మితభాషి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాటికి కాలం చెల్లిందనే చెప్పాలి. ఆ నేపధ్యంలోనే కళా స్వభావానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం ఉన్న అచ్చెన్నను పార్టీ సారధిగా చంద్రబాబు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవసరానికి తగ్గ దూకుడు, తెగువ, మంచి వాక్ఫటిమ, రాజకీయ చతురత, దిగువస్థాయి నుండి పైస్థాయి వరకు పార్టీ కేడర్తో సన్నిహిత సంబంధాలు, అధినాయకత్వంతో సత్సంబంధాలు అచ్చెన్నకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి.
అభినందనల వెల్లువ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా అచ్చెన్నాయుడు నియామక ప్రకటన వెలువడిన మరుక్షణం నుండి అభిమానులు, పార్టీ నాయకులు ఆయన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు చేరుకుని అభినందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరోమారు రాష్ట్రంలో విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న స్థానిక, సాధారణ ఎన్నికల్లో పార్టీని గెలిపించి, పూర్వ వైభవం తెచ్చేందుకు అచ్చెన్న ఎంతవరకు దోహదపడతారో, అధినాయకత్వం ఆశలను సఫలీకృతం చేయడంలో ఏ మేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే.